
అంతర్జాతీయ స్థాయిలో టూరిజం ప్రాజెక్టులు
మహారాణిపేట : అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖలో టూరిజం ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని, భవిష్యత్‌లో స్టార్ రేటింగ్ కలిగిన 10 వేల రూమ్‌లు అందుబాటులోకి తేవాల్సి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. బుధవారం జిల్లాకు విచ్చేసిన ఆయన విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులతో స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశమయ్యారు. తొలుత ఉమ్మడి జిల్లాల్లో చేపట్టబోయే టూరిజం ప్రాజెక్టులపై సమీక్షించి, సూచనలు చేశారు. భోగాపురం మండల పరిధిలో నిర్మించబోయే ఒబెరాయ్ హోటల్, విశాఖ జిల్లా భీమిలి మండల పరిధిలోని అన్నవరంలో నిర్మించే మై ఫెయిర్స్ హోటల్ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని, నిర్ణీత సమయంలోగా ఆయా కంపెనీలకు భూమిని అందజేయాలని ఆదేశించారు. కనెక్టింగ్ రోడ్లు నిర్మించాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. గోస్తనీ నది నుంచి పైప్‌లైన్ల ద్వారా ఆయా హోటళ్ల తాగునీటి అవసరాలకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం విశాఖ జిల్లాలో చేపట్టబోయే టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక శాఖ పరిధిలో ఉన్న భూముల క్రమబద్ధీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నగర పరిధిలో చేపట్టబోయే ప్రాజెక్టులు, భూసేకరణ ప్రక్రియపై స్పెషల్ సీఎస్‌కు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ వివరించారు. వీఎంఆర్డీఏ కమిషనర్ కె.విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ కె.మయూర్ అశోక్, విజయనగరం జేసీ సేతుమాధవన్, ఒబెరాయ్, మై ఫెయిర్స్ హోటళ్ల ప్రతినిధులు శంకర్, మనోజ్, విజయనగరం ఆర్డీవో కీర్తి, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, తదితరులు పాల్గొన్నారు.