
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అమలు చేయాలి
కలెక్టర్‌కు వైఎస్సార్ సీపీ వినతి
మహారాణిపేట: విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ఉచిత విద్యను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు డిమాండ్ చేశారు. ప్రతి ఏటా ప్రైవేట్ పాఠశాలలు ప్రవేశ తరగతిలో 25 శాతం సీట్లను సామాజికంగా వెనుకబడిన, ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు ఉచితంగా కేటాయించాలని కలెక్టర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. పిల్లల నుంచి ఎటువంటి ప్రవేశ పరీక్షలు, ఫీజులు, దరఖాస్తు రుసుం వసూలు చేయరాదని, పాఠశాల యాజమాన్యాలు ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాలని గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మీడియా ద్వారా డిమాండ్ చేశారు. అయితే చాలా పాఠశాలలు ఈ చట్టాన్ని పాటించడం లేదని కె.కె.రాజు అన్నారు. పేద కుటుంబాల పిల్లలు, దివ్యాంగులు, అనాథలు వంటి వారు ప్రవేశం కోసం దరఖాస్తు చేసినప్పటికీ.. వివిధ అడ్డంకులు కల్పించి తిరస్కరిస్తున్నారన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని, పేద పిల్లల విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ చేపట్టి.. తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవి రెడ్డి, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, కార్పొరేటర్లు పద్మా రెడ్డి, శశికళ, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు అంబటి శైలేష్, పేడాడ రమణి కుమారి, శివరామకృష్ణ, సనపల రవీంద్ర భరత్, పులగం కొండారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లేశ్వరి, పార్టీ నాయకులు శేఖర్, సాగర్, సూర్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.