
నగరాభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించాలి
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
డాబాగార్డెన్స్: విశాఖ నగరాభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బీచ్ సమీపంలోని స్మార్ట్‌సిటీ కార్యాలయంలో జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ నగరాభివృద్ధి దిశగా జీవీఎంసీ అన్ని జోన్లలో ఇప్పటికే ప్రతిపాదించిన రోడ్లు, యాన్యువిటీ మోడల్ ప్రతిపాదనలు, అభివృద్ధిపై సమీక్షించారు. రోడ్లు, కాలువలు, కల్వర్టులు, కూడళ్ల అభివృద్ధి, మీడియన్లు, విద్యుత్ దీపాలు, నీటి సరఫరా నిర్వహణ, డిశాలినేషన్ ప్లాంట్ తదితర పనులపై దృష్టి సారించాలని వారిని ఆదేశించారు. పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, తాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పనులు వేగవంతం చేసి, ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో నిర్మాణంలో ఉన్న భూగర్భ డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, రుషికొండ వద్ద డ్రైనేజీ స్కీమ్ పనులపై కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నగరాన్ని ఆకర్షణీయంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని ప్రధాన ఇంజినీర్ పల్లంరాజును ఆదేశించారు. సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ వర్మ, పర్యవేక్షక ఇంజినీర్లు, స్మార్ట్ సిటీ మేనేజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.