కూటమి కన్ను | - | Sakshi
Sakshi News home page

కూటమి కన్ను

Jul 5 2025 5:52 AM | Updated on Jul 5 2025 5:52 AM

కూటమి

కూటమి కన్ను

వీఎంఆర్డీఏ భూములపై
● మధ్యతరగతి పేరుతో ‘ప్రైవేట్‌’కు పెద్ద పీట ● ‘ఐకానిక్‌’ టవర్‌ ముసుగులో భూముల పందేరం ● మధురవాడలో 4.07 ఎకరాల్లో 50 అంతస్తుల నిర్మాణం ● మిథిలాపురి కాలనీ, మధురవాడ, మారికవలస, వేపగుంట ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు ● పీపీపీ విధానంలో ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం ● వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో తీర్మానం

బోర్డు సమావేశంలో

పలు అంశాలకు ఆమోదం

చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ అధ్యక్షతన జరిగిన వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో కమిషనర్‌ విశ్వనాథన్‌తో పాటు బోర్డు సభ్యులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇందులో పలు అంశాలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. మధురవాడ, మిథిలాపురి కాలనీ, మారికవలస, వేపగుంట, ఇతర ప్రాంతాల్లో పీపీపీ విధానంలో అపార్టుమెంట్ల నిర్మాణాలకు ఆమోదించింది.

● అనకాపల్లి జిల్లా కొత్తూరు గ్రామం సర్వే నెంబర్‌ 608/1పీలో ఉన్న 5.68 ఎకరాల విస్తీర్ణంలో రూ 5.35 కోట్ల వ్యయంతో పిల్లల కోసం సిటీ లెవెల్‌ పార్క్‌ నిర్మాణానికి ఆమోదించింది. ఇందులో ఆట స్థలం, యోగా చేసుకునేందుకు యోగా ముద్ర విగ్రహాలతో కూడిన నిర్దేశిత ప్రదేశం, జిమ్‌ పరికరాలు, యాంఫీ థియేటర్‌, బాస్కెట్‌ బాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ కోర్టులు, స్కేటింగ్‌ రింక్‌, ఇతర సదుపాయాలు ఉండనున్నాయి.

● వేపగుంట–పినగాడి బృహత్తర ప్రణాళిక రహదారి అభివృద్ధికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతంలో 4 కి.మీ. పొడవైన రోడ్డును వీఎంఆర్డీఏ, అర్బన్‌ ప్రాంతంలో మిగిలిన 3 కి.మీ రహదారిని జీవీఎంసీ మొత్తంగా రూ.14.8 కోట్లతో నిర్మించనున్నారు.

● బీచ్‌ రోడ్‌లోని వీఎంఆర్డీఏ పార్కులో రూ 2.50 కోట్లతో ప్రస్తుతమున్న స్కేటింగ్‌ రింక్‌ పక్కనే 63వ జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ క్రీడా పోటీల నిర్వహణకు, అంతర్జాతీయ పోటీలకు అనువుగా రాష్ట్రంలోనే మొట్ట మొదటి స్కేట్‌ బోర్డ్‌ పార్క్‌ నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. సమాశంలో రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వ ప్లాన్‌ ఆ పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపించనుంది. ‘మధ్య తరగతి’ పేరు చెప్పి భారీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి స్కెచ్‌ వేసింది. వీఎంఆర్డీఏ స్థలాల అభివృద్ధి పేరుతో విలువైన భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని నిర్ణయించింది. కూటమి ప్రజా ప్రతినిధులు, వారి అనుచరుల ద్వారా నగరంలో భారీ ఆకాశ హర్మ్యాల నిర్మాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం జరిగిన వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. ప్రైవేట్‌, పబ్లిక్‌ భాగస్వామ్యం(పీపీపీ) పేరుతో నగరంలో ఐదు ప్రాంతాల్లో రూ.కోట్లు విలువ చేసే భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టనున్నారు. ఈ స్థలాల్లో భారీ అపార్టుమెంట్లను నిర్మించనున్నారు.

నిబంధనలు పక్కదారి

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీఎంఆర్డీఏలో పాలన పక్కదారి పట్టింది. ప్రాజెక్టుల టెండర్ల నుంచి షాపుల వేలం వరకు అన్నింటిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు కై లాసగిరిపై బ్యాటరీ కార్లకు అనుమతులిచ్చేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో టెండర్ల ప్రక్రియను చేపట్టారు. సిరిపురం జంక్షన్‌లోని ‘ది డెక్‌’మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ అండ్‌ కమర్షియల్‌ భవన నిర్వహణను సింగిల్‌ టెండర్‌ వేసిన సంస్థకే కట్టబెట్టేశారు. బీచ్‌ రోడ్డులో టీయూ–142 మ్యూజియం నిర్వహణ టెండర్‌.. కూటమి ప్రజాప్రతినిధికి సంబంధించిన కాంట్రాక్టర్‌కు దక్కలేదన్న కారణంగా ఆ టెండర్‌నే రద్దు చేశారు. ఆ పనులకు మళ్లీ టెండర్లను ఆహ్వానించారు. షాపుల లీజుల వ్యవహారం ఒక మాయాజాలంగా మారింది. అప్‌సెట్‌ ధరలకే షాపుల కేటాయింపులు జరిగిపోతున్నాయి. ఇలా వీఎంఆర్డీఏలో అన్ని టెండర్లు, వేలం, ఇతర పనులన్నీ కూటమి ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. కూటమి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు కారణంగా అధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. వారి ఆదేశాలను శిరసావహించడానికే పరిమితమవుతున్నారు.

మధురవాడలో 50 అంతస్తుల నిర్మాణం

నగరంలో ఐదు ప్రాంతాల్లో పీపీపీ విధానంలో అపార్టుమెంట్ల నిర్మాణానికి వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో అనుమతులు ఇచ్చేశారు. ప్రధానంగా మధురవాడ సర్వే నంబర్‌ 331/1లో 4.07 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 50 అంతస్తులతో ఐకానిక్‌ రెసిడెన్షియల్‌ భవనాన్ని నిర్మించడానికి అనుమతించారు. ఇందులో 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్స్‌, 4 బీహెచ్‌కే డూప్లెక్స్‌లతో కలిగిన 6 టవర్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో క్లబ్‌ హౌస్‌, స్విమ్మింగ్‌ పూల్‌, పూల్‌ డెక్‌, పిల్లల ఆటల ప్రాంగణం, సైకిల్‌ ట్రాక్‌, జాగింగ్‌ ట్రాక్‌, ఇతర అత్యాధునిక వసతులతో జాయింట్‌ మోడల్‌/పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు సామాన్య, మధ్య తరగతి వారు కొనుగోలు చేసే అవకాశం లేదు.

మధ్యతరగతి కోసమంటూ..

వీఎంఆర్డీఏకు మిథిలాపురి కాలనీ, మధురవాడ, మారికవలస, వేపగుంట, ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థలాల్లో మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ధరల్లో అపార్టుమెంట్లను నిర్మించేందుకు బోర్డు అనుమతులిచ్చింది. వీటిలో 2, 2.5, 3 బెడ్‌రూమ్‌లతో ఫ్లాట్లను అభివృద్ధి చేయనున్నారు. వీటిని కూడా పీపీపీ పద్ధతిలో నిర్మాణాలను చేపట్టనున్నారు. దశాబ్దం కిందట వీఎంఆర్డీఏ పీపీపీ విధానంలో మధురవాడలో హరిత ప్రాజెక్టును చేపట్టింది. దీని నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగింది. ఈ నిర్మాణంలో అనేక వివాదాలు ముసురుకున్నాయి. దీంతో అప్పటి నుంచి వీఎంఆర్డీఏ పీపీపీ విధానంలో మరో అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి పూనుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వంలో మళ్లీ అదే విధానం పేరుతో ఆకాశహర్మ్యాలకు సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రాజెక్టులను కూటమి నేతలకే చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

భూములు కొట్టేసేందుకు కుట్ర

విశాఖలో వీఎంఆర్డీఏకు విలువైన భూములు ఉన్నాయి. ఈ స్థలాలను ఇప్పటి వరకు పర్యాటక ప్రాజెక్టులకు మాత్రమే పీపీపీ విధానంలో కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీటిపై ఆ పార్టీల నేతలు, వారి అనుచరుల కన్ను పడింది. వీటిని కొట్టేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం వీఎంఆర్డీఏ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ధరల్లో అపార్టుమెంట్ల నిర్మాణం పేరుతో ఈ విలువైన భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు వీఎంఆర్డీఏ బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం త్వరలోనే పీపీపీ విధానంలో భూములను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కేటాయించనున్నారు. కేవలం కూటమి నేతలు, వారి అనుచరులకు లబ్ధి చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కూటమి కన్ను1
1/2

కూటమి కన్ను

కూటమి కన్ను2
2/2

కూటమి కన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement