
మాస్టర్ స్ట్రోక్..!
కొత్త లేఅవుట్లకు..
బృహత్తర ప్రణాళిక పేరుతో కొత్త లేఅవుట్ల ప్లాన్లకు మోకాలడ్డు కూటమి ప్రజాప్రతినిధుల కుయుక్తులు
● మాస్టర్ ప్లాన్–2041లో మార్పులకూ పట్టు ● మాస్టర్‌ప్లాన్ రోడ్లు వస్తాయన్న నెపంతో లేఅవుట్లకు అనుమతుల నిరాకరణ ● దరఖాస్తు చేసుకునే వారితో మంతనాలు ● తమ వాటాలు ఇవ్వకుంటే ప్లాన్లు రాకుండా చేస్తామని హెచ్చరికలు ● స్థిరాస్తి వ్యాపారానికి గుదిబండలా ప్రజాప్రతినిధుల నిర్ణయాలు
విశాఖ సిటీ : కూటమి ప్రజాప్రతినిధుల ‘మాస్టర్ ప్లాన్’ స్థిరాస్తి రంగం ఊపిరి ఆపేసేలా ఉంది. బృహత్తర ప్రణాళిక పునఃపరిశీలన ప్రక్రియ విశాఖ రియల్ ఎస్టేట్‌ను వెంటిలేటర్‌పైకి ఎక్కించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో భూక్రయ, విక్రయాల్లో స్తబ్దత కొనసాగుతోంది. రాజకీయ స్వలాభం, స్వప్రయోజనాల కోసం కూటమి ప్రజాప్రతినిధులు వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్–2041 సవరణలకు పూనుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరింత శాపంగా పరిణమించింది. ప్రధానంగా బృహత్తర ప్రణాళిక రహదారుల పేరుతో కొత్త అవుట్లకు మోకాలడ్డుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది స్థిరాస్తి వ్యాపారులకు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతోంది.
లేఅవుట్లకు అనుమతులు నిరాకరణ?
వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునః పరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. వాస్తవానికి గత నెలలోనే ఫిర్యాదుల స్వీకరణకు గడువు ముగిసింది. ఈ ప్రక్రియలో వేల సంఖ్యలో అభ్యంతరాలు వస్తాయని కూటమి ప్రజాప్రతినిధులు భావించారు. కానీ అనూహ్యంగా కేవలం 755 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. దీంతో అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17వ తేదీ వరకు గడువు పొడిగించారు. మాస్టర్‌ప్లాన్‌లో సవరణల పేరుతో ప్రజాప్రతినిధులు భారీగా లబ్ధి పొందేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఒకవైపు తమ భూముల ధరలు పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూనే మరోవైపు ప్రైవేటు లేఅవుట్లకు అనుమతులు రాకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బృహత్తర ప్రణాళిక రహదారులు వస్తాయన్న నెపంతో కొత్త లేఅవుట్లను అనుమతులు ఇవ్వకుండా హోల్డ్‌లో పెడుతున్నట్లు రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాటాల కోసం మంతనాలు
మాస్టర్ ప్లాన్ పూర్తయినంత వరకు కొత్తగా లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయకూడదని కూటమి ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బృహత్తర ప్రణాళికను పూర్తి చేసేందుకు మరో మూడు, నాలుగు నెలలు పట్టే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్ని అడ్డుపెట్టుకుని వారి అనుచరులు రియల్ వ్యాపారులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తమ వాటాలు ఇవ్వకుండా లేఅవుట్లకు అనుమతులు వచ్చే అవకాశం లేదని బేరసారాలు చేస్తున్నట్లు వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న స్థిరాస్తి రంగం.. కూటమి నేతల కారణంగా మరింత పతనమయ్యే ప్రమాదముందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
మందగమనంలో స్థిరాస్తి రంగం
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో స్థిరాస్తి రంగం కుదేలైంది. భూముల క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతమున్న ప్రాజెక్టుల్లోనూ ఫ్లాట్లు, వెంచర్లలో ప్లాట్ల అమ్మకాలు పడిపోయాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.1,526 కోట్లు లక్ష్యంగా కాగా.. కేవలం 75 శాతం మేర ఆదాయం మాత్రమే సమకూరడమే జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైందనడానికి నిదర్శనం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు లక్ష్యానికి మించి రూ.1060.03 కోట్లు సమకూరింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా వెంచర్లు, నిర్మాణాలకు ఎవరూ సాహసించడం లేదు. గత ఏడాది కాలంగా కొత్త లేఅవుట్ల అభివృద్ధికి ఎవరూ ముందుకు రాకపోవడం జిల్లాలో స్థిరాస్తి రంగ పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో వీఎంఆర్‌డీఏ పరిధిలో పదుల సంఖ్యలో కొత్త లేఅవుట్లకు దరఖాస్తులు వచ్చేవి. ఇప్పుడు కేవలం ముగ్గురు, నలుగురు వ్యాపారులు మాత్రమే లేఅవుట్లకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటికి కూడా బృహత్తర ప్రణాళిక పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మాస్టర్ స్ట్రోక్..!