
పేద రోగికి ‘ఆసరా’ కరువు
● కూటమి ప్రభుత్వంలో అటకెక్కిన ఆరోగ్య ఆసరా ● సాయం ఆగిపోవడంతో పేద రోగుల అవస్థలు ● వైఎస్సార్ సీపీ హయాంలో 1,69,836 మందికి రూ.98.43 కోట్ల సాయం
మహారాణిపేట: ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న పేద రోగులు కోలుకునే సమయంలో ఆర్థిక భరోసా కల్పించే ‘ఆరోగ్య ఆసరా’ పథకం అమలు నిలిచిపోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దిగ్విజయంగా కొనసాగిన ఈ పథకం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటకెక్కింది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం కింద నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తుండటంతో డిశ్చార్జ్ సమయంలో అందాల్సిన ఆర్థిక సాయం కోసం రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ నిరాశకు గురవుతున్నారు.
ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స అనంతరం జీవన భృతి కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని 2019 డిసెంబర్ 2న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద శస్త్రచికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకు, రోజుకు రూ. 225 చొప్పున, నెలకు గరిష్టంగా రూ. 5,000 వరకు జీవన భృతిని అందించేవారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజే ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. సాధారణ ప్రసవాలకు, సిజేరియన్లకు రూ. 5,000, గుండె సంబంధిత సర్జరీలకు రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు చికిత్సను బట్టి సాయం అందేది. ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్లాక కోలుకునే వరకు కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు వారికి ఈ సాయం ఎంతో ఉపయోగపడేది. జిల్లాలో మొత్తం 52 నెట్‌వర్క్ ఆస్పత్రులు, 20 డెంటల్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో మొత్తం 1,69,836 మందికి ఆసరా పథకం ద్వారా రూ.98.43 కోట్లు అందజేశారు.
కూటమి ప్రభుత్వంపై విమర్శలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేసింది. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ వంటి పలు కార్యక్రమాలను అమలుచేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం ద్వారా, ఆపదలో ఉన్న పేదలందరికీ నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొండంత అండగా నిలిచారు. అనారోగ్య సమస్యల వల్ల పేదలు ఆర్థికంగా నష్టపోకూడదని, క్యాన్సర్ వంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యం.. పేదలకు క్రమంగా దూరమవుతోంది. ఆసరా పథకం కింద నిధులు విడుదల కాకపోవడంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిశ్చార్జ్ సమయంలో డబ్బులు వస్తాయని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. ‘ఆసరా డబ్బులు ఎప్పుడు వస్తాయి?’ అని వారు ఆసుపత్రి సిబ్బందిని అడుగుతుండగా, ఏమి సమాధానం చెప్పాలో తెలియక సిబ్బంది సైతం అయోమయంలో ఉన్నారు. విశ్రాంతి సమయంలో కుటుంబ పోషణకు ఉపయోగపడే ఈ సాయం ఆగిపోవడంతో.. పేద రోగులు ఆర్థికంగా మరింత కుంగిపోతున్నారు.
ఆసరా అందించిన ప్రయోజనం ఇదీ..
సంవత్సరం రోగులు పొందిన లబ్ధి
2020–21 18,160 రూ.12.04 కోట్లు
2021–22 33,749 రూ.21.23 కోట్లు
2022–23 29,737 రూ.17.73 కోట్లు
2023–24 58,839 రూ.32.43 కోట్లు
2024–25 29,351 రూ.15.00 కోట్లు
(కూటమి ప్రభుత్వం ఏర్పడిన వరకు)