
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మర్రిపాలెం : తాటిచెట్లపాలెం జాతీయ రహదారి వద్ద బుధవారం వేకువజామున కారును లారీ ఢీకొట్టడంతో రాము అనే యువకుడు మృతిచెందాడు. శంకరమఠం ప్రాంతానికి చెందిన చందక రాము (25), అతడి స్నేహితులు పైడిరాజు, రాజేష్, చిరంజీవి కలిసి కారులో శంకరమఠం నుంచి ఎన్‌ఏడీ కూడలికి వెళ్లారు. మళ్లీ శంకరమఠం వెళ్లేందుకు ఊర్వశి జంక్షన్ మీదుగా తాటిచెట్లపాలెం సిగ్నల్ వద్ద మలుపు తిప్పుతున్న క్రమంలో మద్దిలపాలెం నుంచి ఎన్‌ఏడీ వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ కారుని ఎడమ వైపు వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది. దీంతో అటువైపు కూర్చున్న రాము అక్కడికక్కడే మృతిచెందగా కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడు రాము యాక్ట్ కేబుల్‌లో పనిచేస్తున్నారని, అతడికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నామని తెలిపారు.