
స్కెచ్!
రూ. 208 కోట్ల టీడీఆర్‌కు
అసలు కథ ఇదీ!
పూసపాటి లక్ష్మీ నరసింహరాజుకు రేవళ్లపాలెం ప్రాంతంలో 233 ఎకరాల భూమి ఉంది. రహదారి నిర్మాణంలో ఆయన కోల్పోయిన 9,475.71 చదరపు గజాల స్థలానికి సంబంధించి, అతని కుమారుడైన జోగి జగన్నాథ దేవవర్మకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ఇచ్చారు. ఆ జీపీఏ హోదాలో ఆయన టీడీఆర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీవీఎంసీ అధికారులు నిబంధనల ప్రకారం కోల్పోయిన భూమికి నాలుగింతలు, అంటే 37,902.84 చదరపు గజాలకు టీడీఆర్‌ను జారీ చేశారు. అప్పట్లో గజం విలువ రూ. 55,000గా పేర్కొనడంతో.. ఈ టీడీఆర్ మొత్తం విలువ రూ. 208.40 కోట్లకు చేరింది. తదనంతరం ఈ టీడీఆర్ హక్కులను సదరు యజమాని సాయికృష్ణారెడ్డికి బదిలీ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో టీడీఆర్‌ను రద్దు చేస్తున్నట్టు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
మధురవాడలోని ఓ భూమికి సంబంధించిన ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్
(టీడీఆర్) వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో జారీచేసిన టీడీఆర్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో వెసులుబాటు.. కూటమి నేతల జేబులు నింపుకునేందుకేనని
తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఒక ఎమ్మెల్యే, మంత్రి సుమారు రూ.50 కోట్ల భారీ ఒప్పందానికి తెరలేపినట్లు అధికార
కూటమిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
మధురవాడ గ్రామం సర్వే నంబర్ 2పీకి చెందిన భూమికి సంబంధించి పీఎల్‌ఎన్ రాజు పేరుతో జారీచేసిన టీడీఆర్‌ను గత నెల 5వ తేదీన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి ఈ టీడీఆర్ జారీచేయకూడదని, ఇందులో భారీగా మతలబు జరిగిందంటూ కూటమి నేతలు గతంలో విమర్శలు గుప్పించారు. ప్రైవేటు వ్యక్తులు తమ లేఅవుట్ కోసం రహదారి ఏర్పాటు చేసుకున్న తర్వాత, దానికి టీడీఆర్ ఎలా జారీ చేస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీడీఆర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే రద్దు ఉత్తర్వుల చివర్లో ‘కొత్త దరఖాస్తులను టీడీఆర్ కమిటీ ముందుంచి నిర్ణయం తీసుకోవాలి’ అని ఒక మెలిక పెట్టింది. ఇప్పుడు ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నగరంలోని ఓ ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రూ.50 కోట్ల డీల్ కుదరడంతో.. కొద్ది రోజుల కిందట అదే సర్వే నంబర్ 2పీకి టీడీఆర్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి అనుగుణంగా టీడీఆర్ జారీకి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. వాస్తవానికి టీడీఆర్ రద్దు ఉత్తర్వుల్లో ఎక్కడా విచారణ జరిపినట్టు గానీ, అధికారులను బాధ్యులను చేయడం గానీ జరగలేదు. కేవలం కొత్త ఒప్పందం కోసమే రద్దు నాటకం ఆడారని, అందుకే గతంలో ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రద్దు పేరుతో కపట నాటకం
కొత్తగా దరఖాస్తు
చేసుకోవాలంటూ మెలిక
ఓ మంత్రి, ఎమ్మెల్యే అండదండలతో
వ్యవహారం
తాజాగా టీడీఆర్ కోసం దరఖాస్తు
రూ.50 కోట్లకు డీల్ కుదిరినట్టు
కూటమిలోనే గుసగుసలు
రంగంలోకి సీనియర్ ఎమ్మెల్యే?
మధురవాడ జాతీయ రహదారి నుంచి రేవళ్లపాలెం మీదుగా నవోదయ పాఠశాల వరకు 2014లో రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ రహదారి నిర్మాణం వల్ల 2పీ సర్వే నంబర్‌లోని 9,475.71 చదరపు గజాల భూమిని కోల్పోయామని టీడీఆర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఈ టీడీఆర్‌ను రద్దు చేసినప్పటికీ, కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఇప్పుడు బయటపడుతోంది. టీడీఆర్ రద్దయిన తర్వాత నగరానికి చెందిన ఒక సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఒక మంత్రితో మాట్లాడి రూ.50 కోట్ల ఒప్పందం కుదిర్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ డీల్ ఖరారైన తర్వాతే తిరిగి అదే సర్వే నంబర్‌పై టీడీఆర్ కోసం దరఖాస్తు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ దరఖాస్తు పురపాలక శాఖ పరిశీలనలో ఉంది. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే టీడీఆర్ జారీ అయ్యే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే కేవలం కొత్త డీల్ కోసమే టీడీఆర్ రద్దు నాటకాన్ని ఆడారన్నది స్పష్టమవుతుంది.