వానొస్తే వణుకే.! | - | Sakshi
Sakshi News home page

వానొస్తే వణుకే.!

Jul 3 2025 4:36 AM | Updated on Jul 3 2025 4:36 AM

వానొస

వానొస్తే వణుకే.!

డాబాగార్డెన్స్‌: చిన్నపాటి వర్షానికే విశాఖ నగరం వణికిపోతోంది. అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో కురిసే వర్షాలకు నగరం ముంపునకు గురవుతోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, కొండవాలు, గెడ్డల సమీపంలో నివసించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. దశాబ్దాల కాలంగా పాత నగరం ముంపునకు గురవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

ప్రమాదకరంగా గెడ్డలు

నగరంలో పలు గెడ్డల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గంగులగెడ్డ, ఎర్రిగెడ్డ సహా పలు ప్రధాన కాలువలు(గెడ్డలు) ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పేరుకుపోయిన చెత్త, పూడికను సకాలంలో, పూర్తి స్థాయిలో తొలగించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా చిన్నపాటి వర్షానికే గెడ్డలు పొంగిపొర్లి, సమీపంలోని ఇళ్లను, కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఉధృతంగా ప్రవహించే ఈ గెడ్డల ప్రవాహంలో ప్రమాదవశాత్తు జారిపడితే ప్రాణాలతో బయటపడటం అసాధ్యంగా మారింది.

కళ్లెదుటే మృత్యుఘోష

ఈ గెడ్డలు ఎంత ప్రమాదకరంగా మారాయో చెప్పడానికి ఈ సంఘటనలే నిదర్శనం. 2015 సెప్టెంబర్‌లో డాక్టర్‌ వి.ఎస్‌. కృష్ణ ప్రభుత్వ కళాశాల సమీపంలో వరద నీటి కాలువలో ఆరేళ్ల బాలిక అతిథి కొట్టుకుపోయింది. భారీ వర్షంలో రెండు మూడు రోజుల పాటు పోలీసులు, స్థానిక నివాసితులు, అగ్నిమాపక శాఖ, జీవీఎంసీ, నేవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఐదారేళ్ల కిందట దక్షిణ నియోజకవర్గంలోని గంగులగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండగా.. ఓ ఇంటి వద్ద ఉన్న వృద్ధురాలు అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయారు. దాదాపు 20 రోజుల పాటు పొక్లెయిన్లు, క్రేన్లతో గాలించినా ఆమె జాడ తెలియరాలేదు. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. తాజాగా 54వ వార్డు నలందనగర్‌లో నివాసముంటున్న ఆటోడ్రైవర్‌ కట్ట వడ్డీకాసులు(48) బహిర్భూమికి వెళ్లి గెడ్డలో కాలుజారి పడిపోయాడు. సుమారు 8 గంటల పాటు రెస్క్యూ బృందాలు శ్రమించినా, ఆయన్ను ప్రాణాలతో కాపాడలేకపోయాయి. చివరికి ఆయన మృతదేహాన్నే వెలికితీయగలిగారు.

మారని పాతనగరం తలరాత

పాతనగరం వాసుల కష్టాలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలొచ్చినప్పుడు నేతలు రూపురేఖలు మారుస్తామని హామీలివ్వడం, గెలిచాక మరిచిపోవడం పరిపాటిగా మారింది. రామకృష్ణా జంక్షన్‌, ప్రసాద్‌ గార్డెన్స్‌, వెలంపేట, పూర్ణామార్కెట్‌, పెరికివీధి వంటి ప్రాంతాలు ఏ మాత్రం వర్షం కురిసినా ఇట్టే జలమయమవుతాయి. భారీ వర్షం పడితే ఇళ్లలోకి నీరు చేరి, నివాసితులు నీటిలోనే నిద్రలేని రాత్రులు గడపాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామకృష్ణా జంక్షన్‌, ప్రసాద్‌ గార్డెన్స్‌, పండావీధి, వెలంపేట, పూర్ణా మార్కెట్‌, పెరికివీధి, రాజారామ్మోహన్‌రాయ్‌ రోడ్డు, స్టేడియం రోడ్డు తదితర ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు.

బిక్కుబిక్కుమంటున్న కొండవాలు,

గెడ్డల ప్రాంతాల ప్రజలు

కళ్లముందే కొట్టుకుపోతున్న ప్రాణాలు

ముంపు నీటిలో పాతనగరం

యుద్ధప్రాతిపదికన చర్యలకు

కమిషనర్‌ ఆదేశం

పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాం

జీవీఎంసీ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తున్నాం. ముఖ్యంగా మురుగు కాలువలు, గెడ్డలపై దృష్టి పెట్టాం. గెడ్డల్లో పేరుకుపోయిన చెత్తను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాం. ఇప్పటికే పలు గెడ్డలు, కాలువల్లో సిల్ట్‌ తీయించాం. వర్షాకాలం దృష్ట్యా మలేరియా, డెంగ్యూ జ్వరాలపై సీజనల్‌ సర్వే నిర్వహించనున్నాం.

– కేతన్‌ గార్గ్‌, కమిషనర్‌, జీవీఎంసీ

అధికారుల అరకొర చర్యలు

ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో జీవీఎంసీ అధికారులు మేల్కొని అప్పుడప్పుడు గెడ్డల్లో పూడికతీత పనులు చేపట్టినా.. అది తూతూమంత్రంగానే సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గెడ్డల నుంచి తీసిన చెత్త, సిల్ట్‌ను అక్కడే గట్లపై వదిలేయడంతో, వర్షాలకు అది తిరిగి గెడ్డల్లోకే జారిపోతోంది. దీంతో చేసిన పనికి ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో నగర కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ సంబంధిత అధికారులతో సమీక్షించి, యుద్ధ ప్రాతిపదికన ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, గెడ్డల్లో పూడికను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ ఆదేశాలతో ప్రధాన గెడ్డల్లో చెత్త, సిల్ట్‌ తొలగిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వానొస్తే వణుకే.!1
1/3

వానొస్తే వణుకే.!

వానొస్తే వణుకే.!2
2/3

వానొస్తే వణుకే.!

వానొస్తే వణుకే.!3
3/3

వానొస్తే వణుకే.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement