
‘కూటమి’ కక్కుర్తి
● వర్క్ ఆర్డర్ కూడా లేకుండా వాటర్ ట్యాంక్ కూల్చివేతకు సిద్ధం ● ఒక్కసారిగా కుప్పకూలిన ట్యాంక్.. ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలు ● ప్రాణాపాయస్థితిలో కేజీహెచ్‌కు తరలింపు, గుట్టుచప్పుడు కాకుండా చికిత్స ● రూ.40 వేల కాంట్రాక్ట్ కోసం కూటమి నాయకుల దిగజారుడుతనం ● పెందుర్తి మండలంలో ఘటన
పెందుర్తి: అధికార కూటమి నాయకుల కాసుల కక్కుర్తి ఇద్దరు దినసరి కూలీల ప్రాణాల మీదకు తెచ్చింది. పంచాయతీ నుంచి కనీసం అనుమతి, వర్క్ ఆర్డర్ లేకుండా కేవలం కాంట్రాక్టర్‌కు, తమకు లబ్ధి కలగాలన్న దురాశతో పాతబడిన వాటర్ ట్యాంక్‌ను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో ఉన్న ఇద్దరు కూలీలు తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ బొడ్డునాయుడుపాలెంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యంత్రాలతో తొలగించాల్సిన పాత ట్యాంక్‌ను కేవలం ఇద్దరు కూలీలతో తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో పాటు తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్యాంక్‌లో ఉన్న దొగ్గవానిపాలెంకి చెందిన కూలీలు ఆర్.శివప్రసాద్(30), దమ్ము నవీన్(17) తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని కాంట్రాక్టర్, స్థానిక జనసేన నాయకులు కేజీహెచ్‌కు తరలించి గట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయిస్తున్నారు. శివప్రసాద్ తలకు తీవ్ర గాయం కావడంతో మంగళవారం వేకువజామున మెదడుకు శస్త్రచికిత్స చేశారు. వెన్నుపూసకు, గజ్జల్లో తీవ్రగాయాలు కావడంతో నవీన్ అత్యవసర చికిత్స విభాగంలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదం విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
ముదపాక పంచాయతీ బొడ్డునాయుడుపాలెంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.24 లక్షల జలజీవన్ మిషన్ నిధులతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. కాగా అదే గ్రామంలో వినియోగంలో లేని మంచినీటి పథకం ట్యాంక్ ప్రమాదకరస్థితిలో ఉంది. ఈ క్రమంలో దాన్ని తొలగించేందుకు దాదాపు రెండు నెలల క్రితం పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. తొలగింపు చేసేందుకు అధికారుల అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ట్యాంక్ తొలగింపునకు పంచాయతీ పాలకవర్గంతో పాటు కార్యదర్శి అనుమతి కూడా ఉండాలి. ట్యాంక్ తొలగింపునకు పూర్తిస్థాయి అనుమతితో పాటు అయ్యే ఖర్చును కూడా పంచాయతీ నిధులనే వెచ్చించాలి. ఈ క్రమంలో గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ట్యాంక్ తొలగింపునకు రూ.40 వేలు పైచిలుకు అవుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆయా నిధులను కేటాయిస్తూ.. దాన్ని తొలగించే కాంట్రాక్టర్ వివరాలను పొందుపరుస్తూ అధికారికంగా పంచాయతీ నుంచి తీర్మానం రూపంలో అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇక్కడే స్థానిక జనసేన నాయకులు వేలు పెట్టారు ‘అనుమతి లేదు ఏమీ లేదు’ మాకు నచ్చిన కాంట్రాక్టర్‌ను పెట్టుకుంటాం.. బిల్లులు ఇవ్వండి అంటూ పరోక్షంగా అధికారులకు చెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పంచాయతీ పాలకవర్గానికి గానీ, పంచాయతీ కార్యదర్శికి గానీ తెలియకుండా చింతలగ్రహారానికి చెందిన కాంట్రాక్టర్ సత్తిబాబు ఇద్దరు కూలీలు నవీన్, శివప్రసాద్‌లను తీసుకువచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు.
అయ్యో పాపం
ఓ వైపు నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా కేవలం కూటమి నాయకుల జోక్యంతో పనులు ప్రారంభించారు. మరోవైపు యంత్రాలతో చేయాల్సిన పనిని కేవలం ఇద్దరు కూలీలను పెట్టారు. ఈ క్రమంలో ట్యాంక్ లోపలకు వెళ్లి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో.. ట్యాంక్ దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో అందులో ఉన్న నవీన్, శివప్రసాద్‌కు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రాణాపాయస్థితిలో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
అంతా గప్‌చుప్
ప్రమాద సయయంలో గ్రామంలో భీతవహ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ట్యాంక్ ఖాళీ స్థలంలో పడింది కాబట్టి సరిపోయింది గానీ అదే మరోవైపు పడితే అటువైపు ఇళ్లు ఉన్నాయి. నష్టం తీవ్రంగా ఉండేది. కాగా ప్రమాద విషయాన్ని బయటకు పొక్కకుండా కూటమి నాయకులు విశ్వప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. నియోజవర్గంలోని ఓ ముఖ్యనేత ద్వారా జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతో కేజీహెచ్‌లో బాధిత కూలీలకు గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయిస్తున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న శివప్రసాద్‌కు కేజీహెచ్ చరిత్రలోనే తొలిసారిగా వేకువజామున శస్త్రచికిత్స చేయించినట్లు తెలిసింది. అదే క్రమంలో బాధిత కుటుంబాలను కూడా విషయాన్ని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఆదిపత్యం కోసం, కాసుల కక్కుర్తి కోసం కూటమి నాయకులు వ్యవహరించిన తీరుపై సర్వాత్రాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘కూటమి’ కక్కుర్తి

‘కూటమి’ కక్కుర్తి