
జూలో ఎన్‌క్లోజర్ల పునరుద్ధరణకు చర్యలు
ఆరిలోవ : ఇందిరాగాంధీ జా పార్కులో అవసరమైన ఎన్‌క్లోజర్లు పునరుద్ధరణకు నివేదిక సిద్ధం చేయాలని జూ అధికారులకు రాష్ట్ర అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే సూచించారు. జూ పార్కును మంగళవారం ఆయన సందర్శించారు. విశాఖ సీఎఫ్ మహ్మద్ దివాన్ మైదీన్, జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అధికారులతో కలసి ఆయన జూలో ఎన్‌క్లోజర్లు, వన్యప్రాణులను పరిశీలించారు. ఇటీవల జూలో నిర్మించిన కొత్త ఎన్‌క్లోజర్లు, మరమ్మతులు చేపట్టిన ఎన్‌క్లోజర్లను పరిశీలించి వాటి కోసం ఎంత నిధుల ఖర్చుచేశారు.. సీఎస్‌ఆర్ నిధులు ఏఏ సంస్థలు నుంచి వచ్చాయి.. తదితర వాటిపై ఆరా తీశారు. ఇటీవల పునరుద్ధరించిన సీతాకోక చిలుకల పార్కు, కొత్తగా నిర్మించిన అడవి కుక్కల పునరుత్పత్తి కేంద్రం అదనపు విభాగాన్ని పరిశీలించారు. వన్యప్రాణులు ఆరోగ్యం, వాటికి అందిస్తున్న వైద్య సేవలు, ఆహారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన జూ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రాబందుల ఎన్‌క్లోజరు పనులు వేగవంతం చేయాలని సూచించారు. అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని రాబోయే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి విభాగంలో అవసరమైన ఎన్‌క్లోజర్ల పునరుద్ధరణ, సీఎస్‌ఆర్ నిధుల ద్వారా మరమ్మతులు, సుందరీకరణ చేపట్టడానికి నివేదిక తయారు చేయాలన్నారు. వాటితో పాటు జూలో అక్వేరియం, స్లాత్‌బేర్, రెడ్‌నెక్డ్ వాల్లబీ, అడవి పిల్లుల ఎన్‌క్లోజర్‌ను పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్శనలో జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, జూ వైద్యుడు డాక్టర్ భాను, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే