
మొక్కలు నాటి సంరక్షించండి
కొమ్మాది: ప్రతి ఒక్కరూ ‘తల్లికి వందనం’పేరుతో మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా పెంచాలని ఎన్‌సీసీ 13 బెటాలియన్ ఎల్‌టీ కల్నల్, కమాండింగ్ అధికారి నీరజ్‌కుమార్ పిలుపునిచ్చారు. రుషికొండలోని గాయత్రి విద్యా పరిషత్ వద్ద సోమవారం నిర్వహించిన ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణం దెబ్బతినడం వల్ల జరుగుతున్న అనర్థాలను క్యాడెట్లకు వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతకాలానికి వర్షాలు లేక తాగడానికి నీరు దొరకని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశం మేరకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. శిక్షణ పొందుతున్న 600 మంది క్యాడెట్లు ఒక్కొక్కరు కనీసం పది మొక్కలు నాటాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించవద్దని, ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, ఎన్‌సీసీ డిప్యూటీ క్యాంప్ లెఫ్టినెంట్ కల్నల్ స్వర్నిం, సుబేదార్ మేజర్ శ్రీనివాస్, ఎన్‌సీసీ అధికారులు కెప్టెన్ అనంత్ భాస్కర్, కెప్టెన్ కల్యాణ్ అశోక్, కెప్టెన్ ఉమానాగేశ్వరి పాల్గొన్నారు.