
జీవీఎంసీకి 58 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) తూతూమంత్రంగా సాగింది. కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొనలేదు. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి 58 వినతులు స్వీకరించారు. జీవీఎంసీ పరిపాలన, ఖాతాల విభాగానికి 7, రెవెన్యూ విభాగానికి 9, ప్రజారోగ్య విభాగానికి 6, పట్టణ ప్రణాళికా విభాగానికి 25, ఇంజినీరింగ్ విభాగానికి 9, మొక్కల విభాగం, యూసీడీ విభాగానికి ఒక్కో ఫిర్యాదు అందింది. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, ఫైనాన్స్ అడ్వైజర్ మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఫుట్‌పాత్ ఆక్రమణలపై చర్యలేవి? : జీవీఎంసీ 33, 34, 35 వార్డుల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీని వల్ల పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని ఆయా వార్డులకు చెందిన పలువురు అదనపు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడమే కాకుండా రోడ్లపై ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయనివ్వడం లేదని.. ఈ విషయాన్ని సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలని కోరారు.
అపరిష్కృతంగా మంచినీటి సమస్య
రైల్వే న్యూకాలనీలో నివాసం ఉంటున్న తనకు మంచినీటి కుళాయి కనెక్షన్ విషయంలో అన్యాయం జరిగిందని గుళ్ల కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తనది నివాస ప్రాంతమైనప్పటికీ, కమర్షియల్ ట్యాక్స్ విధిస్తున్నారని, 2016–2017 నుంచి ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. కమర్షియల్ నుంచి డొమెస్టిక్‌గా మార్చినప్పటికీ, ఇప్పటివరకు పాత బిల్లును సరిచేయలేదని అదనపు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల పరిధిలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.