
ఆర్టీసీ బస్సు బీభత్సం
గాయపడిన వ్యక్తి బంగారు ఉంగరాల చోరీ
ఆరిలోవ: విజయనగరం నుంచి కూర్మన్నపాలెం వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం హనుమంతవాక కూడలి వద్ద బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు, ఒక ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును, దెబ్బతిన్న ఇతర వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సబ్బి రాజుపై లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సంబంధించిన రెండు బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. ఘటనా స్థలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.