
కంటి క్యాన్సర్‌పై అవగాహన అవసరం
ఏయూక్యాంపస్: కంటి క్యాన్సర్‌పై అవగాహనకల్పిస్తూ ఎల్.వి ప్రసాద్ నేత్ర వైద్య శాల ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో ఆదివారం వైటాథాన్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆర్.కె బీచ్ నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ ముఖ్య వైద్యుడు డాక్టర్ వీరేంద్ర సచ్‌దేవ రెటినోబ్లాస్టోమా(కంటి క్యాన్సర్) లక్షణాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాచారం పొందిన వ్యక్తులు.. ఆ వివరాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు. తద్వారా కంటి దృష్టిని, ప్రాణాన్ని కాపాడటం సాధ్యపడుతుందన్నారు. పిల్లల కంటిలో తెల్లని ప్రతిబింబం కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. వైటాథాన్ ద్వారా సేకరించిన నిధులను ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్లో రెటినోబ్లాస్టోమా చికిత్సను ఉపయోగిస్తామని తెలిపారు. మూడేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులను ఎక్కువగా ప్రభావితం చేసే కంటి వ్యాధి రెటినోబ్లాస్టోమా అని అన్నారు. మెల్లకన్ను, ఎరుపెక్కిన కళ్లు, వాచిన కనురెప్పలు, ఉబ్బిన కళ్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, నగరవాసులు పాల్గొన్నారు. ముందుగా కాళీమాత ఆలయం వద్ద కంటి క్యాన్సర్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.