
సేంద్రియ మామిడి మేళాకు స్పందన
ఆరిలోవ: విశాలాక్షినగర్‌లోని బీవీకే జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన రెండో విడత సేంద్రియ మామిడి పండ్ల మేళా విజయవంతంగా ముగిసింది. గత వారం రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ మేళాకు విశేషమైన స్పందన రావడంతో.. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు రెండో విడతగా శని, ఆదివారాల్లో మళ్లీ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాలో రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించిన వివిధ రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. విశాలాక్షినగర్‌తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మామిడి పండ్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి చవ్వాకుల అశోక్ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను ఈ మేళాలో విక్రయించడానికి రైతులు మందుకు రావడం, వినియోగదారులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేళాలో పంచదార కలిశాలు, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి, స్వాగతం, అమృతం, పాపారాజు గోవా, బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న రసాలు, కొబ్బరి అంటు, ముంత మామిడి, నాగులపల్లి రసాలు, హైదర్ సాయిబు, జహంగీర్ పెద్ద రసాలు, ఇమామ్ పసందు వంటి అనేక రకాల మామిడి పండ్లను రైతులు విక్రయించారు.