
జర్నలిస్ట్‌లు సమాజ ప్రగతి సాధకులు
బీచ్‌రోడ్డు: జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులని, వారి వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తోందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. వైజాగ్ మీడియా అవార్డ్స్, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, భవిష్యత్తులో అపారమైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి ఆశాకిరణాలని, ఉన్నత విద్యతో వారు కోరుకున్న ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు. అవార్డు, ఉపకారవేతనాల నిర్వాహక కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు, చీఫ్ ఆర్గనైజర్ ఆర్.నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎంఎల్, బీఎల్, నర్సింగ్, ఇంజినీరింగ్ చదువుతున్న 33 మందికి, క్రీడలు, సంగీతం వంటి విభాగాల్లో 11 మందికి ప్రతిభా పురస్కారాలను అందజేసినట్లు తెలిపారు. ఎల్‌కేజీ నుంచి డిగ్రీ వరకు అత్యధిక మార్కులు సాధించిన 126 మంది జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశామన్నారు. ప్రముఖ సంఘ సేవకుడు కమల్ బెయిద్, బెహరా భాస్కరరావు, స్థిత ప్రజ్ఞ ఫౌండేషన్ చైర్మన్ వై.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.