
బీసీ బాలుర హాస్టల్ ప్రారంభం
పెదగంట్యాడ: విద్యా రంగ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకారం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. జీవీఎంసీ 77వ వార్డు పరిధిలోని ఇస్లాంపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు రూ. 97 లక్షలతో నిర్మించిన బీసీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే విద్యా రంగంలో మరింత రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైజాగ్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీదేవి, డీఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు.