
ఆన్‌లైన్ చిక్కులు.. గురువులకు తిప్పలు
విశాఖ విద్య: టీచర్ల బదిలీల్లో ఆన్‌లైన్ దరఖాస్తులు ఓ ప్రహసనంగా మారాయి. సర్వీసు పరమైన వివరాలు సవ్యంగా నమోదుకాక తీవ్రంగా నష్టపోతున్నారు. దరఖాస్తు సమయంలో వెబ్‌సైట్‌లో చూపిస్తున్న వివరాలకు భిన్నంగా ఫైనల్ జాబితాలో చూపిస్తుండటంతో ఏ మారుమూలకు కొట్టుకుపోతామోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఖాళీలపై స్పష్టతేదీ?
బదిలీల నేపథ్యంలో క్లియర్ వేకెన్సీ, 5/8 లాంగ్‌స్టాండింగ్ వేకెన్సీల ప్రకటనలో జిల్లా విద్యాశాఖ నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. తొలుత 4,788 ఖాళీలు ప్రకటించారు. ఆ తర్వాత 4,811గా బయటకు లీకులిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మళ్లీ దీనిపై కసరత్తు చేశారు. ఇదంతా తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది
యూపీ స్కూళ్లలో పోస్టులు మాయం
ప్రాథమికోన్నత(యూపీ) పాఠశాలల్లో పోస్టుల కోతను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల కోరిక మేరకు, డిమాండ్ ఉన్న చోట యూపీ స్కూళ్లను కొనసాగిస్తున్నట్లు చెప్పిన కూటమి ప్రభుత్వం, లోపాయికారీగా వాటిని నిర్వీర్యం చేస్తోంది. కొత్తగా జిల్లా విద్యాశాఖ చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియ ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
మోడల్ స్కూల్ హెచ్‌ఎంలు ఎవరో..?
ఉమ్మడి విశాఖ జిల్లాలో 565 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషనలైజేషన్‌లో భాగంగా మిగిలిన 277 మంది స్కూల్ అసిస్టెంట్లను వీటికి హెచ్‌ఎంలుగా నియమిస్తామని తొలుత ప్రకటించారు. కానీ, బదిలీల సమయంలో దీనిపై స్పష్టత లేకపోవటంతో అంతా అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల బదిలీ దరఖాస్తుకు ఆదివారంతో గడువు ముగిసింది. త్వరలోనే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. దీనిపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవటంతో సర్‌ప్లస్ స్కూల్ అసిస్టెంట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాబితాల తయారీకి తలనొప్పులు
బదిలీల నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు వెబెక్స్ సమీక్షల పేరుతో రోజుకో ఆదేశం ఇస్తున్నారు. ఆ మేరకు సీనియార్టీ జాబితాలను తయారు చేసేందుకు జిల్లా విద్యాశాఖ సిబ్బంది తర్జనభర్జనలు పడుతున్నారు. క్షణానికో ఉత్తర్వుతో కేడర్ల వారీగా జాబితాల నమోదులో జాప్యం నెలకొంటోంది. దీంతో సాంకేతిక సమస్యల పరిష్కారం పేరిట నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. దీని వల్లనైనా తమ ఇబ్బందులు పరిష్కరిస్తే చాలని గురువులు కోరుకుంటున్నారు.
కొనసాగుతున్న బదిలీల గందరగోళం
సర్వీస్ పాయింట్ల లెక్కతేలక అయోమయం
సాంకేతిక సమస్యలతో దరఖాస్తుకు ఇబ్బందులు