
67 మంది కళాకారులకు ఘన సత్కారం
మద్దిలపాలెం: ఆల్ ఇండియా రేడియో ద్వారా గుర్తింపు పొందిన 67 మంది బి–హైగ్రేడ్ కళాకారులను విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సత్కరించారు. అకాడమీ అధ్యక్షుడు ఎం.ఎస్.ఎన్. రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణప్రసాద్‌ల చేతుల మీదుగా ఈ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, జానపద, సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ కళాకారులను విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ప్రోత్సహిస్తుందని తెలిపారు. త్వరలో సన్మానం పొందిన కళాకారులతో వంకాయల వెంకటరమణ మృదంగం గ్లోబల్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో సన్నాయిలు, డోళ్లతో లయ విన్యాస కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖ గాత్రవిద్వాంసులు డాక్టర్ ద్వారం త్యాగరాజు బృందం అద్భుతమైన గాత్రకచేరి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పంతులు గోపాలరావు, శారదా సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు.