కొండెక్కిన చికెన్‌ ధర | Sakshi
Sakshi News home page

కొండెక్కిన చికెన్‌ ధర

Published Mon, May 20 2024 6:55 AM

కొండె

సాక్షి, విశాఖపట్నం : కొన్నాళ్ల నుంచి ఒకింత అందుబాటు ధరలో ఉన్న చికెన్‌ ఇప్పుడు చిక్కడం లేదు. రెండు నెలల పాటు కిలో చికెన్‌ రూ.230–260 మధ్య ఉండేది. మూడు వారాల నుంచి స్వల్పంగా పెరుగుతూ తాజాగా రూ.300కి చేరుకుంది. ఈ ఏడాది మార్చి మూడో వారం నుంచే ఎండలు, వడగాడ్పులు తీవ్రంగా ప్రభావం చూపాయి. ఏప్రిల్‌ నాటికి అవి తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ఫారాల్లో పెరుగుతున్న కోళ్లు వడగాడ్పుల ధాటికి పెద్ద సంఖ్యలో చనిపోయాయి. రోజురోజుకూ తీవ్ర వడగాడ్పులు అధికమవుతుండడంతో పౌల్ట్రీ రైతులు కోడి పూర్తిగా ఎదగక పోయినా మార్కెట్‌కు తరలించే వారు. ఫలితంగా చికెన్‌ రేటు దిగి వచ్చింది. ఇలా కిలో చికెన్‌ మార్చి ఏప్రిల్‌ నెలల్లో రూ.230–260కి మించలేదు. మరోవైపు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పౌల్ట్రీ రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని గణనీయంగా తగ్గించారు. కోళ్లను ఫారాల్లో బ్యాచ్‌ల వారీగా పెంచుతారు. కోడి పిల్ల చికెన్‌కు వీలుగా తయారవ్వాలంటే ఏడు నుంచి తొమ్మిది వారాల సమయం పడుతుంది. ఏప్రిల్‌లోనే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మే నెలలో మరింతగా విజృంభించి కోళ్లు మృత్యువాత పడతాయన్న భయంతో పౌల్ట్రీ రైతులు బ్యాచ్‌లను కుదించారు. దీంతో ఇప్పుడు కోళ్లకు కొరత ఏర్పడింది.

డిమాండ్‌కు తగినన్ని బ్రాయిలర్‌ కోళ్ల లభ్యత లేకపోవడంతో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా ఈనెల ఆరంభంలో కిలో స్కిన్‌ లెస్‌ బ్రాయిలర్‌ చికెన్‌ రూ.260 ఉండగా ఇప్పుడది రూ.300కి ఎగబాకింది. అంటే 20 రోజుల్లో కిలోపై రూ.40 పెరిగిందన్న మాట! ఫారాల్లో కొత్తగా వేసిన బ్యాచ్‌లు అందుబాటులోకి రావాలంటే మరో మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల కనీసం మరో మూడు వారాల పాటు చికెన్‌ ధర ప్రియంగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరకంటే ఇంకాస్త పెరిగే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు. చికెన్‌ ప్రియులకు ఈ ధర భారంగానే ఉండనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో రోజుకు మూడు లక్షలు, ఆదివారాల్లో ఆరు లక్షల కిలోల చికెన్‌ అమ్ముడవుతుందని అంచనా. బ్రాయిలర్‌ చికెన్‌ రేటు కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో ఆదివారం ఆ ప్రభావం అమ్మకంపై పడిందని సీతమ్మధారలోని ఓ చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు రామునాయుడు ‘సాక్షి’కి చెప్పాడు.

కిలో రూ.300కి చేరిక

ధర మరింత పెరిగే అవకాశం

వేసవిలో తగ్గిన కోళ్ల పెంపకం

కొండెక్కిన చికెన్‌ ధర
1/1

కొండెక్కిన చికెన్‌ ధర

Advertisement
 
Advertisement
 
Advertisement