ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసులు

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

ప్రభుత్వ భూమిలో ప్రహరీ కూల్చివేత పరిహారం ఇచ్చే వరకు పనులు జరగనివ్వం వేతన బిల్లులు మంజూరు

బషీరాబాద్‌: ఇసుక అక్రమ రవాణాపై ఆదివారం రాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు మూడు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఎక్మాయికి చెందిన గోపాల్‌రెడ్డి, సిద్దిక్‌ మైముద్దీన్‌ ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన ఎరువుల శ్రీనివాస్‌ కుప్పన్‌కోట్‌కు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా ట్రాక్టర్‌, ట్రాలీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ విఠల్‌ హెచ్ఛరించారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌: మండల పరిధిలోని కుంట్లూర్‌ రెవెన్యూ సర్వే నంబర్‌ 24లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన ప్రహరీని సోమవారం తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు గిర్దవార్‌ రాంబాబు, జీపీఓలు జేసీబీ సాయంతో కూల్చివేయించారు. ఈ మేరకు కందకం తవ్వించి అధికారిక బోర్డును ఏర్పాటు చేశారు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీ నిర్మాణం చేపట్టారని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో నిర్మిస్తున్న 330 అడుగుల రేడియల్‌ రహదారి నిర్మాణ పనులను సోమవారం మండల పరిధిలోని బేగరికంచె రైతులు అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని నిలదీశారు. వీరికి సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుబ్బాక రాంచందర్‌, మండల కార్యదర్శి బుట్టి బాల్‌రాజ్‌ మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు వారి వద్దకు వచ్చారు. కలెక్టర్‌తో గతంలో నిర్వహించిన సమావేశంలో ఎకరాకు రూ.35 లక్షలు ఇస్తామని అంగీకరించారని, మళ్లీ ఎందుకు పనులు అడ్డుకుంటున్నారని తహసీల్దార్‌ గోపాల్‌ వారిని ప్రశ్నించారు. ఎకరాకు రూ.40 లక్షలు పరిహారం ఇవ్వాలని, ఏఏ రైతు భూమి రోడ్డు నిర్మాణంలో పోతుందో లిస్టు ప్రదర్శించాలని రైతులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆర్డీఓను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని తహసీల్దార్‌ వారికి సూచించి పంపించారు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పంచాయతీ సర్పంచులు, పారిశుద్ధ్య కార్మికుల వేతన బిల్లులను ప్రభుత్వం మంజూరు చేసింది. డిసెంబర్‌ 22 నుంచి మే 2026 వరకు జిల్లాలోని 515 మంది సర్పంచులకు మొత్తం రూ.1,78,13,850 విడుదల చేసింది. మరో పది మంది సర్పంచుల ఆధార్‌ నంబర్లు ఇతర ఖాతాలతో అనుసంధానమై ఉండటం, ఇతర శాఖల నుంచి వేతనాలు పొందుతుండటంతో వేతనాలను నిలిపివేశారు. మాడ్గుల మండలం నర్సంపల్లికి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వ హించలేదు. ఆ గ్రామ పంచాయతీకి గౌరవ వేతన చెల్లింపు చేయలేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని 2,907 మంది పంచాయతీ సిబ్బందికి నెలకు రూ.9,500 చొప్పున మే నెలకు సంబంధించిన వేతనాలు రూ.2,68,94,500 ఆయా ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌ ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement