జిల్లాలోని పది మండలాల్లో అమలు 556 స్కూళ్లకు చెందిన 44,246 మంది విద్యార్థులకు ప్రయోజనం
తాండూరు: ఏ విద్యార్థీ ఆకలిలో పాఠశాల గడప తొక్కొద్దని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలు పునఃప్రారంభం రోజు(సోమవారం) నుంచే బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది. గత ఏడాది కొడంగల్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేశారు. సత్ఫలితాలు రావడంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి మరో 10 మండలాకు విస్తరించాలని నిర్ణయించారు.
జిల్లాలో 1,030 పాఠశాలలు
జిల్లాలో 20 మండలాలు.. 1,030 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 70వేల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఉదయం చాలా మంది విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలలకు వస్తుంటారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం వారి ఆకలి తీర్చాలని నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పది మండలాల్లోని 556 ప్రభుత్వ పాఠశాలల్లో 44,246 మంది విద్యార్థులకు ఉదయం బడి గంట మోగగానే బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు.
హరేకృష్ణ ఫౌండేషన్‌కు బాధ్యతలు
అల్పాహార పథకం బాధ్యతలను ప్రభుత్వం హరేకృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించింది. ఈ సంస్థకు కొడంగల్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంది. గతేడాది కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, దుద్యాల్, కొడంగల్ మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించింది. ఈ ఏడాది కొత్త పాఠశాలల బాధ్యతలు కూడా ఈ ఫౌండేషన్‌కే అప్పగించారు.
మెనూ ఇలా..
సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం 9 గంటలకు ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం అల్పాహారం అందించనున్నారు. సోమవారం దోసె చట్నీ, చపాతి – కూర, పాలు, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ(రెండు), సాంబార్, రాగిజావ, బుధవారం రెండు పూరీలు ఆలూ కుర్మా, పాలు, గురువారం మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, రాగిజావ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా, పొంగల్ చట్నీ, పాలు, శనివారం రెండు బొండాలు, చట్నీ, రాగిజావ అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
సర్కారు బడుల్లో అల్పాహార పథకం
ఎంపిక చేసిన మండలాలు ఇవే..
మండలం పాఠశాలల సంఖ్య విద్యార్థుల సంఖ్య
బషీరాబాద్ 61 4,264
బొంరాస్‌పేట్ 46 2,657
దోమ 66 4,506
దౌల్తాబాద్ 40 3,308
దుద్యాల్ 26 1,742
కొడంగల్ 54 4,405
కుల్కచర్ల 66 3,831
పరిగి 64 5,202
తాండూరు 74 9,474
యాలాల 59 4,857


