అనంతగిరి: పద్య పదభారతి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బందప్ప గౌడ్ శనివారం తెలిపారు. అధ్యక్షుడిగా రాఘవేంద్ర చారి, వ్యవస్థాపక అధ్యక్షుడిగా శతావధాని మలుగ అంజయ్య, ఉపాధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, రఘురాం రెడ్డి, అనంత కిషన్, రెడ్యా రాథోడ్, ప్రధాన కార్యదర్శిగా మల్కనెల్లి లాల్‌రెడ్డి, సహ కార్యదర్శులుగా జంగయ్య, మొగులయ్య, సుధాకర్ రెడ్డి, దివాకర శాస్త్రి, సాంస్కృతిక కార్యదర్శిగా గడ్డమీది యాదయ్య, కోశాధికారిగా శ్రీనివాస్ చారి, మహిళా విభాగం కార్యదర్శగా కొండపురం లక్ష్మి, కార్యవర్గ సభ్యులుగా కందాడ విఠల్‌రెడ్డి, అడవి రెడ్డి, భగవద్గీత రాములు, శ్రీరాములు, మీనపల్లి ముకుంద్ రెడ్డి, బుచ్చన్న, వెంకట్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలుగు భాష మన అమ్మ భాష అని, ఈ భాషకు పద్యం వెన్నెముక లాంటిదన్నారు. పద్యం ఉన్నంత కాలం తెలుగు భాష నిలిచి ఉంటుందన్నారు.. కార్యక్రమంలో పలువురు కవులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
వ్యవసాయ కమిటీ చైర్మన్ ఆంజనేయులు
కుల్కచర్ల: రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కుల్కచర్ల మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. శనివారం ముజాహిద్‌పూర్‌లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారని, ఎవరూ ఆందోళన చెందరాదన్నారు. తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగొలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో వరి కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్ వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.
జొన్న కొనుగోలుకేంద్రం ప్రారంభం
బంట్వారం: జొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి అన్నారు. శనివారం కోట్‌పల్లి మండలం లింగంపల్లి చౌరస్తాలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.3,699 మద్దతు ధర ప్రకటించిందన్నారు. తేమ శాతం 12 ఉండాలన్నారు. ఆరబెట్టిన జొన్నలనే తేవాలని రైతులకు సూచించారు. పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రతులతో పాటు, పంట సాగు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అంజయ్య, సొసైటీ సీఈఓ శ్రీనివాస్, ఏఓ కరుణాకర్‌రెడ్డి, డైరెక్టర్లు సుదర్శన్‌రెడ్డి, వెంకట్రామ్‌రెడ్డి, రాధాకృష్ణగౌడ్, మధుసూదన్‌రెడ్డి, మాణెయ్య, నాయకులు మహేశ్వర్‌రెడ్డి, నక్కల బందెయ్య పాల్గొన్నారు.
అనంతగిరిలో
అధికమాస యజ్ఞాలు
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట అనంతపద్మనాభ స్వామి ఆలయంలో అధికమాసం సందర్భంగా 30 రోజుల పాటు యజ్ఞాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం కృష్ణ యజ్ఞం ఘనంగా నిర్వహించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అధికమాసంలో యజ్ఞాలు నిర్వహించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని ఆలయ పురోహితులు తెలిపారు. కార్యక్రమంలో పరిగి మాజీ సర్పంచ్ పార్థసారథి, బీఆర్‌ఎస్ యువ నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి, దోమ మండల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


