పరిగి: ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మా భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని రైతులు తేల్చి చెప్పారు. గురువారం మండలంలోని రాపోల్ గ్రామంలో తహసీల్దార్ వెంకటేశ్వరీ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సభ నిర్వహించారు. ఆర్డీఓ వాసుచంద్ర ముఖ్య అతిథిగా హాజరై రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తోందని తెలిపారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రైతులు ఆందోళన చెందరాదని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మెరుగైనా పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
నిరాకరించిన రైతులు
పరిశ్రమల కోసం రాపోల్ గ్రామంలో 600 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 509 ఎకరాల ప్రభుత్వ భూమి, 101 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. అయితే తమకు జీవనాధారమైన మొత్తం భూమిని లాక్కుంటే రోడ్డు న పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదన్నారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే చావు ఒక్కటే శరణ్యమని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పరిహారంపై అధికారులు స్పష్టత నివ్వడం లేదు.
భారీ బందోబస్తు మధ్య..
ప్రజాభిప్రాయ సభను భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ముగ్గురు డీస్పీలు, 13 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డులు, ఇంటలిజన్స్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్ విభాగం అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్దకు గ్రామ రైతులను మాత్రమే అనుమతించారు.


