యజమాని అజాగ్రత్తతోనే భారీ దోపిడీ | - | Sakshi
Sakshi News home page

యజమాని అజాగ్రత్తతోనే భారీ దోపిడీ

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

గచ్చిబౌలి: గచ్చిబౌలి హిల్‌రిడ్జ్‌ విల్లాస్‌లో జరిగిన భారీ దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి 7.837 కిలోల బంగారు నగలు, 1.367 కిలోల వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్‌ సీపీ డాక్టర్‌ రమేష్‌ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విల్లా నంబర్‌ 73లో నివసించే ప్రకాష్‌ పాయ్‌ వద్ద నేపాల్‌కు చెందిన కమల్‌ షాహీ, విమల్‌ షాహీ దంపతులు వాచ్‌మెన్‌, సర్వెంట్లుగా చేరారు. ఈ నెల 6న యజమాని కుటుంబం ముంబై వెళ్లగా, ప్రధాన సూత్రధారి సురేష్‌ షాహీ ప్లాన్‌ ప్రకారం వారు లోపలికి చొరబడ్డారు. బెడ్‌రూమ్‌లోని కలశంలో ఉన్న తాళం చెవితో లాకర్‌ తెరిచి భారీగా నగలు దోచుకున్నారు. అనంతరం సికింద్రాబాద్‌ నుంచి రైలులో ఉత్తరప్రదేశ్‌కు పరారయ్యారు. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కొత్త సిమ్‌ కార్డ్‌ ఆధారంగా యూపీ, బీహార్‌, ఉత్తరాఖండ్‌ పోలీసుల సహకారంతో నేపాల్‌ సరిహద్దుకు రెండు గంటల ముందే నిందితులను ఉదంపూర్‌లో పట్టుకున్నారు. కమల్‌, విమల్‌, కల్పన, భిశ్వకర్మలను అరెస్ట్‌ చేయగా, సురేష్‌ షాహీ పరారీలో ఉన్నాడు. లాకర్‌ తాళం చెవిని అక్కడే వదిలేయడం యజమాని అజాగ్రత్తను తెలియజేస్తోందని సీపీ అన్నారు. మొదట్లోనే ’డయల్‌ 100’కు కాల్‌ చేసి ఉంటే ఇంత శ్రమ ఉండేది కాదన్నారు. హిల్‌రిడ్జ్‌ విల్లాస్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, నేపాలీ పనివారిని చేర్చుకునే ముందు జాగ్రత్తలు వహించాలని సీపీ సూచించారు.

7.837 కిలోల బంగారు ఆభరణాలు,1.36 కిలోల వెండి స్వాధీనం

వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ సీపీ డాక్టర్‌ రమేష్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement