 
															పెళ్లికి వెళ్లేలా.. వారధి మరమ్మతు!
ధారూరు: మండల పరిధిలోని రుద్రారం– నాగసమందర్ మధ్య ఉన్న వంతెన.. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు నీటి ప్రవాహంతో గురువారం తెల్లవారుజామున ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు మండలాలతో పాటు కర్ణాటకలోని కుంచారం వెళ్లేందుకు ఇదొక్కటే దారి. మరో రూట్‌లో వెళ్లాలంటే 30 కిలోమీటర్లకుపైగా అదనంగా తిరగాల్సిందే. ఇదిలా ఉండగా నాగసమందర్ గ్రామానికి చెందిన కుమ్మరి వీరేశం తన కూరుతు వివాహాన్ని శుక్రవారం వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బంధువులందరూ ఈ మార్గంలోనే వేడుకకు వెళ్లాల్సి ఉంది. దెబ్బతిన్న వంతెనను అధికారులు బాగుచేయిస్తారని అంతా భావించారు. కానీ ఎవరూ అటువైపు రాకపోవడంతో పెళ్లి కూతురు తండ్రి వీరేశం తన సొంత డబ్బులతో వంతెనపై మట్టి వేయించి, జేసీబీతో చదను చేయించారు. దీంతో సాయంత్రం వేళ రాకపోకలు ప్రారంభమయ్యాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
