 
															విరుల తోట.. సిరుల పంట
షాబాద్: ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందేందుకు రైతులు పూల సాగుపై దృష్టి సారించారు. సీజన్లలో చామంతి, బంతి, జర్మన్, గులాబీ తదితర వారికి డిమాండ్ ఉండడంతో విరులు విరబూయిస్తూ.. వారింట సిరుల పంట పండించుకొంటున్నారు.
సంప్రదాయ పంటలను వదిలి..
సంప్రదాయ పంటలను వదిలి ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో రైతులు చాలా మంది వివిధ రకాల పూల తోటల సాగుపై మొగ్గు చూపుతున్నారు. షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి, మాచన్‌పల్లి, హైతాబాద్, మద్దూరు, సోలీపేట్, నాంధార్‌ఖాన్‌పేట్ తదితర గ్రామాల్లో సాగు చేస్తున్నారు. శివస్వాములు, హనుమాన్, అయ్యప్ప భక్తులు పూజలకు, పెళ్లిళ్ల సీజన్లు, పండుగల సమయాల్లో పూల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో కాలానికి అనుగుణంగా లాభదాయకంగా ఉండే పుష్పాలను పండిస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్నామని తెలిపారు.
సీజన్‌లో మంచి ధర..
సర్దార్‌నగర్ గ్రామానికి చెందిన దాదె రాజు, స్వప్న దంపతులు పూల సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. మూడు ఎకరాల్లో గులాబీ, చామంతి, బంతిని సాగు చేస్తూ లాభాలు అర్జిస్తున్నారు. అంతిరెడ్డిగూడలో రైతు గడ్డం రాజు.. ఎకరా భూమిలో గులాబీ తోట విరబూయిస్తున్నాడు. నగరంలోని పూల మార్కెట్లకు తరలించి, విక్రయిస్తున్నారు. కిలో పూలకు రూ.300 నుంచి రూ.400 వరకు ధర పలుకుతోందని చెబుతున్నారు. వివాహాలు, పేరంటాలకు పరిసర ప్రాంతాల ప్రజలు తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.
పెట్టుబడి తక్కువ
ఎకరా పొలంలో ఏటా గులాబీ, బంతి, చామంతిని సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నాం. వివాహాలు, పూజ కార్యక్రమాలు, పండుగల సమయాల్లో గిరాకీ బాగుంటుంది. చామంతి పూలను నగరంలోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నాం. తక్కువ పెట్టుబడితో అధికంగా లాభాలు పొందుతున్నాం.
– దాదె రాజు, రైతు, సర్దార్‌నగర్
పూల సాగుతో.. ఆదాయం బాగు
తక్కువ ఖర్చుతో.. ఎక్కువ దిగుబడి
సీజన్లలో పూలకు డిమాండ్
పూ తోటలతో ఆదర్శంగా
నిలుస్తున్న రైతులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
