
మేయర్‌కు దక్కని గౌరవం
● పార్లమెంటు జాతీయ స్థాయి సదస్సుకు మేయర్లు, చైర్ పర్సన్‌లకు ఆహ్వానం ● తిరుపతిలో మేయర్ పేరును విస్మరించిన కూటమి ప్రభుత్వం ● ఆమె స్థానంలో డిప్యూటీ మేయర్ పేరు ప్రతిపాదన ● కూటమి నేతల తీరుపై విమర్శల వెల్లువ
తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డాక తొలిసారి మేయర్ ఎన్నికలను 2021లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వహించింది. మేయర్ స్థానం ఓసీ మహిళ రిజర్వుడ్ కాగా బీసీ మహిళకు కేటాయించేలా నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, యువ నేత భూమన అభినయ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వీరి విజ్ఞప్తి మేరకు పార్టీ అధిష్టానం తిరుపతి మేయర్ స్థానాన్ని బీసీ మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీ పీ తరఫున మేయర్‌గా పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీపడ్డారు. విద్యావంతురాలిని బరిలోకి దింపాలని భూమన తిరుపతిలో జల్లెడ పట్టారు. ఈ క్రమంలో గైనకాలజిస్ట్‌గా విశేష సేవలు అందిస్తూ, వివాదరహితురాలుగా గుర్తింపు పొందిన డాక్టర్ ఆర్ శిరీషను ఎంపిక చేశారు. ఈమె ఎంపికపై నగరవాసులు, మేధావులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేయర్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా 49 స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించడం విశేషం.
నగర ప్రథమ పౌరురాలికి దక్కని గౌరవం
నాడు బీసీ మహిళకు అగ్రతాంబూలం
ఓసీ మహిళకు రిజర్వ్ అయిన స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించి వైఎస్సార్ సీపీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బీసీ అంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదని, తమ పార్టీకి బీసీలు అంటే బ్యాక్ బోన్ అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేకమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ శిరీషను ఏరికోరి మేయర్ ను చేసి బీసీలకు పట్టం కట్టారు. నేడు కూటమి ప్రభుత్వం అదే మహిళను అవమానించేలా వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. బీసీలు సైతం కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా యాదవులు తమ వర్గానికి చెందిన మహిళకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ భగ్గుమంటున్నారు. ఎన్నికల ముందు బీసీల పాట పాడే చంద్రబాబు ఎన్నికలయ్యాక బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తుంటారని ఓ వర్గం మండపడుతోంది.
రెండో డిప్యూటీ మేయర్ పేరు
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా నిర్వహించే జాతీయ సెమినార్‌కు తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీషను వెళ్లనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ జాతీయ సెమినార్‌కు గుంటూరు కార్పొరేషన్ నుంచి మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ని, మరో మున్సిపాలిటీ నుంచి చైర్ పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్‌ని ఎంపిక చేసిన ప్రభుత్వం తిరుపతిలో మాత్రం మేయర్‌ను పూర్తిగా పక్కన పెట్టి రెండవ డిప్యూటీ మేయర్‌ను మాత్రమే పంపించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. నగర ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన కనీస మర్యాదను కూడా ఇవ్వకుండా వ్యవహరించడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు. వివాదరహితురాలైన మేయర్‌ను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ముఖ్యంగా బీసీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక ఇలా బీసీ మహిళా మేయర్ పట్ల అవమానించేలా వ్యవహరించడం ఏంటని నిలదీస్తున్నారు. మేయర్ స్థానంలో రెండవ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణను పంపించడం ఏంటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను మాత్రమే పంపించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు కారణమైంది.
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా భారత పార్లమెంటు నిర్వహిస్తున్న ‘ది రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రంత్నింగ్ కాంట్రట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తోంది. జూలై 3, 4 తేదీల్లో నిర్వహించే ఈ జాతీయ కాన్ఫరెన్స్‌కు ఆయా రాష్ట్రాల నుంచి మేయర్లు, చైర్ పర్సన్లను పంపించాలని పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థల నుంచి మేయర్‌లు, మున్సిపాలిటీల నుంచి చైర్ పర్సన్లను పంపించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం జాతీయ సదస్సుకు ఎవరెవరిని పంపించాలన్న దానిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు కక్ష సాధింపుగా, ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యత లేకుండా చేసేలా ఉండడంపై రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చిన్న పదవుల్లో ఉన్నా ఎంపిక చేసి ఉన్నత పదవుల్లో ఉన్న మేయర్లకు మొండి చేయి చూపించి, ఆ పదవులకు అవమానం తెచ్చేలా వ్యవహరించారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్లమెంటు నిర్వహించే ఈ అత్యున్నత జాతీయ సదస్సుకు వైఎస్సాఆర్‌సీపీకి చెందిన మేయర్లు, చైర్ పర్సన్‌లను పంపించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు.

మేయర్‌కు దక్కని గౌరవం