
కాళంగినదిలో మునిగి వ్యక్తి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: కాళంగి నదిలో నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు, గ్రామానికి చెందిన బాబురెడ్డి (54) గేదెలను పోషణతో జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కాళంగి నది సమీపంలోని పొలాల వద్దకు గేదెలను తోలుకుని వెళ్లారు. గెదేలు నదిలోకి దిగి రాకపోవటంతో వాటిని బయటకు తీసురావటానికి నీటిలో దిగాడు. అయితే ఈతరాని బాబురెడ్డి నీటిలో మునిగి మృతి చెందాడు. ఇది గమనించిన అక్కడి రైతులు బాబురెడ్డిని నీళ్ల నుంచి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందడంతో వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బాబురెడ్డికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ విశ్వనాథనాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.