
కొలువుల కోత
● రేషనలైజేషన్ పేరుతో సచివాలయాల కుదింపు ● ప్రశ్నార్థకంగా ఉద్యోగుల భవిత ● ప్రభుత్వ వైఖరిపై సిబ్బంది ఆగ్రహం
తిరుపతి అర్బన్ : క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం, సత్వరమే సేవలు అందించే సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం కక్షగట్టింది. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల మెడపై కత్తి పెట్టింది. ఈ మేరకు జిల్లాలోని 691 సచివాలయాలను 353కి తగ్గించింది. అదే క్రమంలో 5,625 మంది సిబ్బందికి గాను 3,650 మందికి మాత్రమే ప్రస్తుత బదిలీల్లో పోస్టింగ్ ఇచ్చింది. మిగిలిన 1,975 మంది సచివాలయ సిబ్బంది భవితను ప్రశ్నార్థకంగా మార్చేసింది.
ఉద్యోగుల తగ్గింపు!
సచివాలయాల్లోని ఒక్కో విభాగంలో 30 నుంచి 80 మంది ఉద్యోగులను తగ్గించినట్లు తెలుస్తోంది. ఒక్కో సచివాలయంలో 30 విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిలో భారీగా కోత విధించినట్లు సమాచారం. తాజాగా నిర్వహించిన బదిలీల్లో వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే రేషనలైజేషన్ నేపథ్యంలో ఖాళీలు లేవని...ఏదో ఒకచోట సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. అప్పటి వరకు వారంతా రిజర్వులోనే ఉండాల్సిన దుస్థితి దాపురించింది.
నిబంధనలకు నీళ్లు
ఇటీవల చేపట్టిన బదిలీల్లో నిబంధనలకు నీళ్లు వదిలేశారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పోటీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు పొందామని గుర్తు చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం కూటమి నేతల సిఫార్సు ఉన్నవారికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అలాగే లంచాలు ముట్టజెప్పిన వారికి సైతం ప్రాధాన్యమిచ్చారని మండిపడుతున్నారు. మిగిలిన వారిని పట్టించుకోకుండా రిజర్వులో పెట్టేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేతనం కూడా నిలిపేసే ప్రమాదముందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
డివిజన్ గతంలో ప్రస్తుతం
సచివాలయాల
సంఖ్య
తిరుపతి 245 125
శ్రీకాళహస్తి 154 82
సూళ్లూరుపేట 137 68
గూడూరు 155 78
మొత్తం 691 353
జిల్లా సమాచారం