
విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
తిరుపతి అర్బన్ : కొత్తగా రానున్న విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు అర్జున్, రమేష్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. అలిపిరి, తిరుపతి, మంగళం డిపోల్లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లోని పదోన్నతులు వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే డబుల్ డ్యూటీలు చేస్తున్న వారికి డీడీ అమౌంట్ పెంచాలన్నారు. విజయవాడలోని సీసీఎస్ ఆఫీస్‌ను బస్టాండ్‌కు 8 కిలోమీటర్ల దూరానికి మార్పు చేయాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండు చేశారు. ప్రధానంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. డీఏ బకాయిలను చెల్లించకుండా దీర్ఘకాలంగా జాప్యం చేయడాన్ని తప్పుపట్టారు. ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మస్తాన్, ప్రచార కార్యదర్శి సతీష్‌నాయుడు, సత్యనారాయణ, ఆయా డిపోలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.