
బడి కోసం..ఆగని పోరాటం
నాయుడుపేటటౌన్ : పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలు విద్యాభ్యాసం చేసే ప్రాథమిక పాఠశాలలను మోడల్ బడుల్లో విలీనం చేసేందుకు తెగబడుతోందని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు నాయుడుపేట చంద్రబాబు నాయుడు కాలనీలోని బడిలో ఉన్న 3,4,5 తరగతులను చదివే విద్యార్ధులను తుమ్మూరు మోడల్ పాఠశాలలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నిరసన తెలిపారు. బడికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. ప్రధానోపాధ్యాయిని ప్రేమలీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మునిరత్నం హుటాహుటిన పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. నచ్చజెప్పి పాఠశాలకు తాళం తీయించారు. ఈ సందర్భంగా స్కూల్‌కమిటీ చైర్‌పర్సన్ నిర్మల మాట్లాడుతూ 25 మంది విద్యార్థులను తుమ్మూరులోని పాఠశాలకు పంపడం దారుణమన్నారు. రైలు పట్టాలు దాటుకుని పిల్లలు అంత దూరం వెళ్లలేరని స్పష్టం చేశారు.
హైవేపై ధర్నా
నారాయణవనం: మా పిల్లలు మా ఊరి బడిలోనే చదవాలంటూ బుధవారం మండలంలోని ఇప్పన్‌తాంగాళ్ దళితవాడ పాఠశాల పిల్లలు, తల్లులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. 14 మంది విద్యార్థులను 3 కిలోమీటర్ల దూరంలోని డీకే పాళ్యం మోడల్ స్కూల్‌కు పంపడానికి ఒప్పుకోమంటూ స్పష్టం చేశారు. బీఎస్పీ సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి ధనుంజయ మాట్లాడుతూ బడుల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవారు.