
ఏటీఎం కార్డు దొంగ అరెస్ట్
రేణిగుంట : ఏటీఎం సెంటర్ల వద్ద కార్డులు దొంగిలించి డబ్బులను విత్ డ్రా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో గురువారం సీఐ మంజునాథరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి జిల్లాలో పలు ఏటీఎంల వద్ద కార్డులను దొంగలించి, వారికి తెలియకుండా డబ్బులు విత్ డ్రా చేసేవాడని తెలిపారు. మే నెల 16వ తేదీ శెట్టిపల్లి ఎస్‌బీఐ వద్ద ఇదే తరహాలో దొంగతనం చేశాడని అన్నారు. ఎల్లమండ్యం ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అతడు చేసిన నేరాలను ఒప్పుకున్నాడని తెలిపారు. అతడి వద్ద వివిధ రకాల ఏటీఎం కార్డులు ఒక స్వైపింగ్ మిషన్, మొబైల్ ఫోన్, రూ.6000 డబ్బులు స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్ నిమిత్తం తిరుపతి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. సిబ్బంది మహేంద్ర, మణి తదితరులు పాల్గొన్నారు.