
అందని పాఠ్య పుస్తకాలు
● టీటీడీ పాఠశాలల్లోనూ విద్యార్థుల అవస్థలు ● పుస్తకాలు లేక నామమాత్రంగా విద్యా బోధన
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని టీటీడీ పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభమయ్యాయి. అయితే ఎయిడెడ్ మినహాయించి అన్‌ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు నేటి వరకు పాఠ్యపుస్తకాలను అందించలేదు. దీంతో విద్యార్థులకు నామమాత్రంగా విద్యాబోధన అందుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ టీటీడీ విద్యాశాఖ స్పందించకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన టీటీడీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించడం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి సన్నిధిలో ఉన్నట్టుగా భావిస్తుంటారు. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకోవడం పూర్వజన్మ సుకృతమని సంతోష పడుతుంటారు. ఈ భావనతోనే తమ పిల్లలను టీటీడీ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతుంటారు. దీంతో టీటీడీ పాఠశాలల్లో ప్రవేశాలకు డిమాండ్ నెలకొంది.
తిరుపతిలో టీటీడీకి సంబంధించి 7 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2,600 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో మూడు పాఠశాలలు (హైస్కూల్) మాత్రమే ప్రభుత్వ గుర్తింపు (ఎయిడెడ్) కలిగి ఉన్నాయి. ఈ హైస్కూళ్లకు ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్లు అందాయి. మిగిలిన నాలుగు ఉన్నత పాఠశాలలు, వాటిలోనే ఉన్న 7ప్రాథమిక పాఠశాలలకు పుస్తకాలు నేటికీ అందలేదు. దీంతో ఇక్కడ చదివే విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
గత ప్రభుత్వం టీటీడీ పాఠశాలలన్నింటికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా సరఫరా చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎయిడెడ్‌కు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందించి చేతులు దులుపుకుంది. ఇటు కూటమి ప్రభుత్వం, అటు టీటీడీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం ఏమిటో అర్థం కాలేదని తల్లిదండ్రులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటనే టీటీడీ యాజమాన్యం స్పందించి పాఠ్యపుస్తకాలను అందించాలని కోరుతున్నారు.
ఎయిడెడ్‌కు అందించాం
ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన టీటీడీ ఉన్నత పాఠశాలలకు పాఠశాల తెరిచే నాటికే పాఠ్యపుస్తకాలను అందించాం. అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు టీటీడీ యాజమాన్యమే పాఠ్యపుస్తకాలను అందించాల్సి ఉంది.
–కేవీఎన్.కుమార్,
జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ), తిరుపతి
త్వరలోనే అందిస్తాం
టీటీడీ పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుందని అనుకున్నాం. అయితే పాఠ్యపుస్తకాలను టీటీడీ కొనుగోలు చేసి పిల్లలకు అందించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ కారణంతోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడంలో జాప్యం నెలకొంది. త్వరలోనే పాఠ్యపుస్తకాలను అందిస్తాం.
–వెంకట సునీల్,
టీటీడీ విద్యాశాఖాధికారి, తిరుపతి