
బీఎస్‌ఎన్‌ఎల్ అవగాహన సదస్సు రేపు
తిరుపతి సిటీ: తిరుపతి బిజినెస్ ఏరియా, భారత్ టెలికాం నియంత్ర సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు తమ ప్రధాన కార్యాలయంలో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ వెంకోబరావు ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ హైజన్, సైబర్ మోసాల నివారణ అనే అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పలు అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
వినండహో.. ఇది గ్రామస్తుల హెచ్చరిక
– ఇసుక ట్రాక్టర్ వస్తే..రూ.1000 జరిమానా
తిరుపతి రూరల్ : ఆ దారిలో ఇసుక ట్రాక్టర్లకు అనుమతి లేదు.. అలా కాదని వస్తే.. రూ.1000 జరిమానా విధించబడును.. అంటూ గ్రామ పంచాయతీ తరపున హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.. బోర్డు పెట్టడమే కాదు.. ఆ గ్రామస్తులు ఇసుక ట్రాక్టర్లు వస్తే అందరూ ఏకమై అడ్డుకుంటున్నారు. తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ పంచాయతీలో ఇరుకు రోడ్లు ఉన్నప్పటికీ ఆ దారిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిస్తున్నారు. ఇళ్ల నుంచి పిల్లలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు రోడ్డు దాటాలన్నా ఇబ్బంది పడేవారు. దీంతో గ్రామ పంచాయతీ అధికారులతో కలసి తమ గ్రామంలోకి ఇసుక ట్రాక్టర్ వస్తే రూ.1000 లు జరిమానా విధించాలని నిర్ణయించారు. ఆ మేరకు గ్రామంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా సరే రాత్రివేళ ఆ దారిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులను గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఇసుక ట్రాక్టర్లు వస్తే రూ.1000 కచ్చితంగా వసూలు చేస్తుండటంతో చాలా మంది ఇసుక అక్రమార్కులు ఆ గ్రామం మీదుగా ట్రాక్టర్లు తీసుకురావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.