
హాస్టల్స్‌లో ప్రవేశాలు
తిరుపతి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా బీసీ హాస్టల్స్‌లో అడ్మిషన్లు చేసుకుంటున్నామని, ప్రస్తుతం జిల్లాలోని 62 హాస్టల్స్‌లో 5060 మంది వరకు విద్యార్థులు ఉన్నారని బీసీ హాస్టల్స్ జిల్లా అధికారి భరత్‌కుమార్ తెలిపారు. 2025–26కి సంబంధించి విద్యార్థులకు అందించాల్సిన అన్ని వస్తువులను అందిస్తున్నామన్నారు. ప్రధానంగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వార్డెన్స్‌కు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి హాస్టల్‌లోను నాణ్యమైన ఆహారం అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. సమీప ప్రాంతాల్లో ఏదైన ఫంక్షన్లు జరిగితే మిగిలిన భోజనం హాస్టల్స్‌కు ఇస్తే తీసుకోరాదని స్పష్టం చేశామన్నారు. జిల్లాలోని ప్రతి హాస్టల్‌ను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు.
ఇసుక తవ్వకాలకు
కొత్త నిబంధనలు
● అరణియార్,స్వర్ణముఽఖిలో తవ్వకాలు నిషేధం
తిరుపతి అర్బన్ : ఇసుక తవ్వకాలకు కొత్త నిబంధనలు వచ్చాయని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియా కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పర్యావరణం, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారు నదులలో ఇసుక తవ్వకం , రవాణాకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో స్వర్ణముఖినది, ఆరణియార్ నుంచి అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలు నిషేధించాలని స్పష్టం చేశారు. అయితే పంచాయితీ పరిధిలోని వాగులు, వంకల నుంచి సచివాలయం అనుమతులతో రసీదు తీసుకుని ఉచితంగా పొందవచ్చునని చెప్పారు. మిగిలిన వారు గూడలి (స్వర్ణముఖి బేరేజీ) డీ–సిల్టేషన్ యార్డు–ఆవిలాల (తిరుపతి) యార్డు, కాటన్ మిల్ (తిరుపతి) యార్డు, గాజులమాండ్యం (రేణిగుంట) యార్డు, శ్రీకాళహస్తి యార్డు, వెంకటగిరి యార్డుల్లో ఇసుకను తీసుకుపోవచ్చునని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు నిఘా ఉంటుందని వివరించారు.