చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు | - | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

Jul 6 2025 6:28 AM | Updated on Jul 6 2025 6:28 AM

చంద్ర

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

● ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలనే కుట్ర ● తలలు పగలగొడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర ● బాధితులపైనే కేసుల నమోదు

ఏం సాధిస్తారో..?

వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ గూండాలు వరుసగా దాడులు చేయడం వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారో చెప్పాలని చంద్రగిరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శరీరంపై కారం చల్లడం, కర్రలతో తల పగలగొట్టడం, చేతులు విరిచేయడం వంటి చర్యలతో ప్రత్యర్థి పార్టీ నేతల రక్తం కళ్ల చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి టీడీపీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఎంతో మంచిగా చూసుకున్నారు కాబట్టే ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సమయానికి టీడీపీ క్యాడర్‌ గట్టిగా నిలబడిందన్న విషయం గుర్తు చేసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన నేతలు సూచిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నేతలను చెవిరెడ్డి ఎక్కడా ఇబ్బంది పెట్టలేదన్న విషయం ఆ పార్టీలోని సీనియర్లు అందరికీ తెలుసని, అయినా వారు ఈ సమయంలో మౌనం వహించి భౌతిక దాడులను ప్రోత్సహించడం భవిష్యత్తు తరాలకు మంచిది కాదంటున్నారు. కరోనా సమయంలో చెవిరెడ్డి చేసిన సాయం వల్ల ఎంత మంది టీడీపీ నేతలు ప్రాణాలతో బయటపడ్డారో ఒక్కసారి గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయాలంటున్నారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అదును చూసి.. అరాచకాలకు తెర లేపింది. తమ క్యాడర్‌కు అండగా నిలబడతాడనుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయించారు.. ఆ నాయకుడి కుమారుడు పైనా తప్పుడు కేసులు పెట్టి క్యాడర్‌కు దూరమయ్యేలా చేశారు. ఎవ్వరి అండా లేదని తెలుసుకుని పార్టీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారు. అందరూ చూస్తుండగానే ఒంటిపై కారం చల్లడం.. కర్రలతో తలలు పగలగొట్టడం.. మహిళ మెడలో మంగళ సూత్రాలు తెంచడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రశాంతమైన పల్లెల్లో టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకాలకు పోలీసులు అండగా నిలబడటంతో మరింతగా రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చంద్రగిరిలో ఎన్నడూలేని విధంగా పల్లెల్లో రాజకీయ వైషమ్యాలను కలిగిస్తున్నారు. ఎన్నికల్లో ఎవరికి వారు నచ్చిన పార్టీకి పనిచేయడం, ఆ తరువాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్నదమ్ముల్లా కలిసి మెలసి ప్రశాంతమైన రాజకీయాలు చేసుకునే చంద్రగిరిలో ప్రస్తుతం అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది.

కుట్రలో భాగంగానే దాడులు

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అక్రమ కేసులో అరెస్టు జరిగిన తరువాత చంద్రగిరిలో ఏం జరుగుతోంది..? ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌పై అధికార టీడీపీ నేతలు చేస్తున్న వరుస దాడులకు కారణం ఏమిటి ? ప్రశాంతమైన పల్లెల్లో రాజకీయ చిచ్చు పెడుతున్నది ఎవ్వరు? బాబు స్వగ్రామం చంద్రగిరిలో ప్రత్యర్థి పార్టీని లేకుండా చేయాలనేనా..? అందులో భాగంగానే వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించారా..? చంద్రగిరి ప్రజలకు పదేళ్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన చెవిరెడ్డిని జైలుకు పంపింది ఆ వ్యూహంలో భాగమేనా..? అన్న ప్రశ్నలకు అందరి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని కుమారుడు మోహిత్‌ రెడ్డి నాయకత్వంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ చాలా బలంగా ఉంది. రాజకీయ విధ్వేషాలను మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులను పది మందిలోకి పిలిపించడం, ఆ తరువాత అవమాన పరిచి దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని అన్నివర్గాల ప్రజలు తప్పు బడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా స్థాయి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈనెల 9వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చంద్రగిరి పార్టీ నేతలు వివరించనున్నట్లు సమాచారం.

బరితెగింపు

అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను టార్గెట్‌ చేసుకుని వరుసగా దాడులు చేస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల రక్తం కళ్ల చూడాలనుకునే టీడీపీ గూండాలు బరితెగించి దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటంపై బాధిత కుటుంబీకులు దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రగిరిలో టీడీపీ చేస్తున్న దౌర్జన్యం, పోలీసుల సహకారంపై ఈనెల 7వ తేదీన తిరుపతి జిల్లా ఎస్పీని కలసి వినతిపత్రం అందించాలని, అప్పటికీ న్యాయం జరగకుంటే బాధితులతో కలసి ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని చంద్రగిరి నియోజకవర్గంలోని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు 
1
1/4

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు 
2
2/4

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు 
3
3/4

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు 
4
4/4

చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement