
అక్రమ అరెస్ట్ పై ఆగ్రహం
తిరుపతి రూరల్ : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డిపై సైతం కక్షగట్టిందని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామాన్ని కాపాడు మహాత్మా అంటూ.. బుధవారం భాకరాపేటలోని పార్టీ కార్యాలయం నుంచి గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. చెవిరెడ్డి అరెస్ట్‌కు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి సీడీసీఎంస్ మాజీ చైర్మన్ సహదేవరెడ్డి, ఎంపీపీ యుగంధర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సింహాల మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. సహదేవరెడ్డి మాట్లాడుతూ చెవిరెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, జగనన్న సైనికులను జైలుకు పంపి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం సిట్ అధికారులు లిక్కర్ కేసులో తప్పులు మీద తప్పులు చేస్తున్నారని, దీనికి భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ఎంపీపీ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలను బిడ్డల్లా చూసుకున్న చెవిరెడ్డికి కష్టం వస్తే ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యుడికే వచ్చినట్టు బాధపడుతున్నారని తెలిపారు. సింహాల మోహన్ మాట్లాడుతూ చెవిరెడ్డిపై ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టినా, కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ యశోద, రామచంద్రాపురం జెడ్పీటీసీ సభ్యులు ఢిల్లీరాణి మాట్లాడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, భాకరాపేట సర్పంచ్ భూపాల్, యూత్ అధ్యక్షుడు మునిరెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.
● భాకరాపేటలో భారీ ర్యాలీ.. నిరసన