
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై నిరసనల హోరు
చంద్రగిరి: ప్రజానేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్టు చేయడంపై నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు వివరించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం వైఎస్ జగన్‌ను కలిశారు. చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలు, అక్రమాలపై అధినేతకు వివరించారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ జగన్ సూచించినట్లు కొటాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
విధుల నుంచి
ఉపాధ్యాయుడి తొలగింపు
బుచ్చినాయుడుకండ్రిగ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్ల ఉపాధ్యాయుడి)గా పనిచేస్తున్న హరిబాబును విధుల నుంచి తొలగిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు రమణయ్య మంగళవారం తెలిపారు. హరిబాబు 02.08.2017 నుంచి 26.08.2024 వరకు 7 సంవత్సరాల 25 రోజులు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై విచారణ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏడాది కంటే ఎక్కువ కాలం విధులకు హాజరు కాకుంటే ఆయన్ను ప్రభుత్వ సర్వీసు నుంచి పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. 30.06.2025 నుంచి హరిబాబును ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు.
రేపు అన్‌ఎయిడెడ్ బంద్
తిరుపతి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు గురువారం బంద్ చేపడుతున్నట్లు అపుస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలలపై అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష చర్యలను నిరసిస్తూ బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నియమాలు సరిగ్గా పరిశీలించకుండా ఎటువంటి నోటీసులు, చర్యలకు ఉపక్రమించకూడదని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.