
రెచ్చిపోతే సహించం
తిరుపతి మంగళం/ చంద్రగిరి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గూండాల దాడుల్లో గాయపడిన పనపాకం, ముంగిలిపట్టు గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలను బుధవారం ఆయన పరామర్శించారు. భూమన మాట్లాడుతూ పనపాకంలో దళిత కుటుంబానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత అజయ్ ఆయన భార్య రోజాతో పాటు వారి సోదరిపై టీడీపీ నేతలు సభ్య సమాజం తలదించుకునేలా దాడి చేశారన్నారు. బాధితుల దుస్తులు చించివేసి, చెప్పు కాళ్లతో తన్ని విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేడని, ఇక జైలు నుంచి రాడని, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నియోజకవర్గంలో లేడనే ధైర్యంతో పచ్చమూక రెచ్చిపోతోందని, ఇకపై వారిని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ నేత సుబ్రమణ్యం నాయకుడు కక్షగట్టి, కళ్లలో కారం కొట్టి అజయ్, ఆయన సతీమణి రోజాపై దుర్మార్గంగా దాడి చేశాడన్నారు. అలాగే ముంగిలిపట్టు సర్పంచ్ భారతి, ఆమె భర్త దామోదర్‌నాయుడు, కుమారుడు భార్గవ్‌పై టీడీపీ నాయకులు దాడులకు తెగబడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సర్పంచ్ తాళిబొట్టు కూడ తెంచేసి కుమారుడు భార్గవ్ చెయ్యి విరిచేశారన్నారు. ఈ క్రమంలో మాకు అధికారం వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చూపే తీవ్రత ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమచంద్రకుమార్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతి రూరల్ మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ, నేతలు పొర్లపల్లె చంద్రశేఖర్‌రెడ్డి, అగరాల భాస్కర్‌రెడ్డి, మస్తాన్, దేవారెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఒంటి శివ, కొత్తపాటి కోటి, బుల్లెట్ చంద్రమౌళిరెడ్డి, ప్రవీణ్, సూరి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అండగా ఉంటాం
టీడీపీ గూండాల దౌర్జన్యాలను అడ్డుకుంటాం
దళితులు, మహిళలపై దాడి అమానుషం
బాధితులను పరామర్శించిన భూమన

రెచ్చిపోతే సహించం