
అరణియార్‌లో చేపల వేటపై నిషేధం
నాగలాపురం : పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టులో ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేటపై నిషేధం విధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, ఎఫ్‌డీఓ మధుసూదన్‌రావు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ చేపల సంతానోత్పత్తి నేపథ్యంలో రెండు నెలల పాటు వేటను నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఆదేశాలను అతిక్రమిస్తే మత్స్యకారుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సహకరించాలని కోరారు.
దివ్యాంగులకు ఉచిత శిక్షణ
తిరుపతి అర్బన్ : జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉచితంగా కంప్యూటర్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు మీరా షైనీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా చేసిన 19–34 ఏళ్ల వారు మాత్రమే అర్హులని వెల్లడించారు.ఆసక్తిగలవారు సదరన్ సర్టిఫికెట్‌తోపాటు ఆధార్‌కార్డు, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో తిరుపతిలోని భవానీ నగర్ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో యూత్ ఫర్ జాబ్స్ కార్యాలయానికి రావాలని కోరారు. ఇతర వివరాలకు 9347411952 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
హస్త కళాకారులకు అండగా ఉంటాం
తిరుపతి అర్బన్ : జిల్లాలోని హస్త కళాకారులకు అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసువులేటి హరిప్రసాద్‌తో కలిసి డీఆర్‌డీఏ, డీఐసీ, లేపాక్షి, శిల్పారామం, టూరిజం, నాబార్డ్ , హ్యాండ్ లూమ్స్, ఖాదీ బోర్డ్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వన్ డిస్ట్రిక్ట్– వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. హస్త కళంకారీకి మార్కెట్ కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఉత్పత్తి, లాభం, ప్రచారం నినాదంతో కళాకారులకు చేయూతనందిస్తామన్నారు. అందరికీ బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హస్తకళల ఏడీ సత్యమూర్తి, చేనేత వస్త్రాల ఏడీలు రమేష్, వెంకట రావు,ి మూర్తి, ఎల్డీఎం రవికుమార్, పర్యాటకశాఖ ఆర్‌డీ రమణ ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ శోభన్ బాబు, ఏపీడీ ప్రభావతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చంద్రశేఖర్, సెట్విన్ సీఈఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.
పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలు
తిరుపతి అర్బన్ : జిల్లాలో డీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జూన్ 6 నుంచి మొత్తం 8 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 33,181 మంది అభ్యర్థులకు గాను 30,952 మంది హాజరైనట్లు వెల్లడించారు. 2,229 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ప్రశాంతంగా పరీక్షలు పూర్తి చేసేందుకు సహకరించివన అన్ని విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుమల హోటళ్లలో
ధరలపై అసత్య ప్రచారం
తిరుమల : తిరుమలలోని హోటళ్లలో ఆహార పదార్థాల ధరలపై సోషల్ మీడియాల్లో సాగుతోందని అసత్య ప్రచారమని టీటీడీ స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తప్పుడు వార్తలను వైరల్ చేసి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించింది. భక్తులకు ఎలాంటి సమాచారం కావల్సి వచిన్నా టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org, కాల్ సెంటర్ 180042 54141కు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించింది.
సర్వ దర్శనానికి
10 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లో నాలుగు కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,126 మంది స్వామివారిని దర్శించుకోగా 24,720 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.