
రసాభాసగా తడుకు ప్రజాభిప్రాయ సేకరణ
పుత్తూరు : మండల పరిధిలోని తడుకు సచివాలయం వద్ద బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా ముగిసింది. సర్పంచ్ వెంకటేశు అధ్యక్షతన సభ నిర్వహించారు. పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. తడుకు రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 182/పి లోని 6 హెక్టార్లు ఆర్.మధుసూదన్‌రావు రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ వారికి, సర్వే నంబర్ 507/2 లోని 2.520 హెక్టార్లు శ్రీకనకదుర్గ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలకు ఇ–వేలం ద్వారా బిల్డర్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందుకు గాను లీజు జారీ చేయడానికి గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి స్థితిగతులు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తడుకు పంచాయతీ ఎంపీటీసీ సుబ్బరత్నమ్మ భర్త గంగాధరం మాట్లాడడానికి ప్రయత్నించగా క్వారీ సిబ్బంది అడ్డుకున్నారు. బలవంతంగా సచివాలయం గదిలోకి తీసుకెళ్లి తాము పరిష్కరిస్తామంటూ గంటకు పైగా నిర్భందించారు. అనంతరం పట్టుబట్టి బయటకు వచ్చిన గంగాధరం ఆర్డీఓ రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేసి, క్వారీలకు అనుమతి ఇవ్వరాదంటూ కోరారు. అలాగే గుంతకల్లు, తాడిపత్రి నుంచి వచ్చిన పర్యావరణ వేత్తల బృందాన్ని సైతం మాట్లాడడానికి సాక్ష్యాత్తు పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ అనుమతించలేదని గ్రామస్తులు ఆరోపించారు. పర్యావరణవేత్తల బృందానికి, క్వారీ యజమానుల సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ గందరగోళం మధ్యనే సభను ముగించారు. కార్యక్రమంలో పొల్యూషన్ ఏడీ మధన్‌మోహన్‌రెడ్డి, ఏఈ శశికళ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.