
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
శ్రీకాళహస్తి : మండలంలోని తొండమనాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు.. ఏర్పేడు మండలం బండారుపల్లెకు చెందిన పూజారి శోభన్‌బాబు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి తిరుపతి వైపు చేపల లోడ్‌తో వెళుతుండగా తిరుపతి నుంచి విజయవాడకు వెళుతున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శోభన్‌బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పచ్చనేతను వదిలేసి.. పక్కనోళ్లపై కేసు
చంద్రగిరి : మండలంలోని జరిగిన ఓ దాడి కేసులో అసలు సూత్రధారి అయిన పచ్చనేతను పోలీసులు వదిలేసి, ఆయనతో కలిసి వెళ్లిన వారిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. వివరాలు.. సోమవారం ఏ.రంగంపేటలో మద్యం దుకాణం వద్ద స్థానిక టీడీపీ నేతకు, నారావారిపల్లెలోని మరో నేతకు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఏ.రంగంపేటకు చెందిన టీడీపీ నేతను ఆయన ఇంటికే వెళ్లి, నారావారిపల్లెకు చెందిన నేత బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పగ పెంచుకున్న రంగంపేట టీడీపీ నేత, కొంత మంది యువకులతో కలసి నారావారిపల్లెలోని టీడీపీ నేత ఇంటికి వెళ్లి దాడికి దిగారు. దీంతో ఆ నేత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గొడవకు ప్రధాన కారణమైన ఏ.రంగంపేట టీడీపీ నేతను ఫిర్యాదులో తప్పించి, ఆయన వెనుక వెళ్లిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వారిని వదిలేసి, అమాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై మండిపడుతున్నారు.
నేటి నుంచి తిరుపతి ఐఐటీలో అంతర్జాతీయ సదస్సు
ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చర్స్‌పై గురువారం నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఐఐటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. నిర్మాణ రంగం మెటీరియల్, టెక్నాలజీ, హెల్త్ మానిటరింగ్, రెట్రోఫిట్టింగ్, స్మార్ట్ టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చించనున్నారు.