
తరిగిపోతున్న పింఛన్లు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లు కూడా కరిగిపోతున్నాయి. గత ఏడాది జూన్‌లో జిల్లాలో 2,71,183 మందికి సామాజిక పింఛన్లు అందించారు. ఈ ఏడాది జూలైలో 2,59,732 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు. కూటమి పాలనలో జిల్లాలో 11,451 పింఛన్లు తగ్గించారు. ప్రతి నెలా సుమారుగా వెయ్యి పింఛన్లు తగ్గిస్తున్నారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నిస్తే, పింఛన్లు తగ్గించలేదని వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. తొలగించిన వారి జాబితా ఇవ్వడానికి అధికారులు విముఖత చూపుతున్నారు. మరోవైపు జిల్లాలో గత ఏడు నెలలుగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.6వేలు పింఛన్లు తీసుకుంటున్న వారిని తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. వీరి జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ జాబితా వస్తే అందులో ఎంత మందిని తొలగించేస్తారోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు రూ.4వేలు పింఛన్ తీసుకుంటున్న వారిని జూలైలో తనిఖీలు చేస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా జిల్లాలో పింఛన్ల ఏరివేత కొనసాగుతోందన్న విషయం మాత్రం తేలిపోయింది.
వితంతు పింఛన్లకు కొత్త మెలిక
వితంతు పింఛన్లలో జాప్యం లేకుండా గత ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఏ కేటగిరిలోనైనా పింఛన్లు తీసుకుంటూ భర్త మృతి చెందితే మాత్రమే వారి సతీమణులకు పింఛన్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ వరకు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతువులు 7వేల మంది ఉన్నట్లు ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి. వీరికి పింఛన్లు వస్తాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు.