
రీ కౌన్సెలింగ్ కోసం ఉద్యోగుల ధర్నా
తిరుపతి అర్బన్: సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత లేనందున రీ కౌన్సెలింగ్ చేయాలంటూ మహిళా పోలీసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళా సంరక్షణ కార్యదర్శులు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నాకు దిగారు. గ్రామ, వార్డు సచివాలయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, తిరుపతి నగర అధ్యక్షుడు విద్యాసాగర్, ఉద్యోగ సంఘం మహిళా నేతలు విజయలక్ష్మి, నజ్మా, జ్ఞానాంబిక, శాంత కుమారి తదితరులు మాట్లాడారు. చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో రెండు రోజుల క్రితం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీల్లో పారదర్శకత లేదని చెప్పారు. రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని వారంతా డిమాండ్ చేశారు. వార్డు పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క వార్డుకు, మండల పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క మండలానికి బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. ప్రధానంగా పంచాయితీల్లో పనిచేస్తున్న వారిని పక్క మండలానికి కాకుండా 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలానికి బదిలీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీల్లో పూర్తిగా సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రాన్ని అందించారు. దీంతో ఆయన చిత్తూరు ఎస్పీ మణికంఠకు ఫోన్ చేసి మాట్లాడి, సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ ఉద్యోగులు దివ్యభారతి, కుమారి, నిహారిక, యోగప్రియ, లక్ష్మీప్రసన్న, లావణ్య, కళ్యాణి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.