
మృతి చెందిన గోపి నాయుడు
గంగాధర నెల్లూరు: మండలంలోని పాత వెంకటాపురం పంచాయతీ అగ్రహారానికి చెందిన రైతు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలం పాతవెంకటాపురానికి చెందిన గోపి నాయుడు (42) ఆదివారం ఉదయం వరి పైరు నాటడానికి తన పొలాన్ని దున్నుతున్న సమయంలో రోటోవేటర్ తిరగబడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
స్కూటర్‌ను ఢీకొన్న కారు
తొట్టంబేడు (శ్రీకాళహస్తి) : మండలంలోని తంగేళ్లపాళెం క్రాస్ వద్ద ఆదివారం కారు ఢీకొనడంతో స్కూటరిస్టు గాయపడ్డాడు. వివరాలు.. బుచ్చినాయుడు కండ్రిగ మండలం పెద్దపాలేడుకు చెందిన నరసింహారెడ్డి(62) స్కూటర్‌పై తన స్వగ్రామానికి వస్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది. క్షతగాత్రుడిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాఘవేంద్ర తెలిపారు.