
చంద్రబాబువి కక్ష రాజకీయాలు
● ఈ అరెస్టులు అప్రజాస్వామికం ● హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం ● వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ ● తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ధ్వజం
తిరుపతి మంగళం: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసేవన్నీ కక్ష రాజకీయాలని తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ అరెస్టులు అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ప్రభుత్వం పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందన్నారు. విపక్ష పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. కూటి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.