సివిల్స్‌లో ఆరు సార్లు ఫెయిల్‌.. ఏడోసారి విజయం! | Yamini Failed Six Times But Finally Cracked IFS | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో ఆరు సార్లు ఫెయిల్‌.. ఏడోసారి విజయం!

May 10 2026 9:37 AM | Updated on May 10 2026 9:42 AM

Yamini Failed Six Times But Finally Cracked IFS

‘నాన్న హెడ్‌ కానిస్టేబుల్, అమ్మ గృహిణి. మేము ఇద్దరం కూతుళ్లం. నాన్న ఉద్యోగానికి వెళితే.. మాకు అమ్మే అన్నీ చూసుకునేది. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. నన్ను ఉన్నతాధికారిగా చూడాలనే అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఐఎఫ్‌ఎస్‌ సాధించగలిగాను’ అని సూర్యాపేటకు చెందిన చల్లా యామిని చెప్పారు. యూపీఎస్సీ వెల్లడించిన ఐఎఫ్‌ఎస్‌ పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో 119వ ర్యాంకు సాధించిన యామిని శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు.

సూర్యాపేటటౌన్‌ : కూతుళ్లు అనే భావన లేకుండా మమ్మల్ని అమ్మానాన్న బాగా పెంచారు. తనను ఉన్నతాధికారిగా ఉండాలని అమ్మానాన్న ప్రోత్సాహించారు. మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సివిల్స్‌లో రాణించాలనే లక్ష్యంతో ఆరు సార్లు పరీక్ష రాసి విఫలమయ్యాను.  పట్టువదలకుండా సివిల్స్‌తో పాటు యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ పరీక్ష రాసి 119వ ర్యాంకు సాధించాను. నేను పెద్ద కూతురిని. నాకు ఒక చెల్లె నందిని ఉంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తోంది. నాన్న తన పైస్థాయి అధికారులను చూపిస్తూ ఇలా ఉన్నతాధికారి కావాలని చెబుతుండేవారు. ఉన్నతాధికారిగా ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేయగలమని, అలాంటి ఉద్యోగం సాధించాలని చెబుతుండటంతో.. ఉన్నతాధికారిగా ఉద్యోగం సాధించాలనే తపన, కృషితో చదివాను.  

ఉద్యోగం చేస్తూనే..
సూర్యాపేటలో పదో తరగతి వరకు, హైదరాబాద్‌లో ఇంటర్, జేఎన్‌టీయూలో బీటెక్‌ చదివాను. బీటెక్‌ తర్వాత ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉద్యోగాల వేటలో పడి 2022లో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న డిఫెన్స్‌ అకౌంట్స్‌ ఆడిటర్‌గా ఉద్యోగం వచ్చింది. 

సివిల్స్‌లో విఫలమై...
2020 నుంచి సివిల్స్‌ పరీక్ష రాస్తున్నా. ఇప్పటి వరకు మొత్తం ఆరు సార్లు సివిల్స్‌ రాసి విఫలమయ్యాను. 2021లో ఇంటర్వ్యూ అయిపోయాక ఫైనల్‌ లిస్టులో 40 మార్కుల తేడాతో ఉద్యోగం రాలేదు. అలాగే 2023లో 20 మార్కుల తేడాతో ఉద్యోగం రాలేదు. అయితే సివిల్స్‌తో పాటు ‘ఆల్‌ ఇండియా ఫారెస్ట్‌ సర్వీస్‌’ పరీక్ష రాయాలని స్నేహితుల ద్వారా తెలుసుకొని 2025 సంవత్సరంలో సివిల్స్‌తో పాటు యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ పరీక్ష రాశాను. అయితే సివిల్స్‌లో ర్యాంకు రాలేదు. ఐఎఫ్‌ఎస్‌లో ఆలిండియాలో 119వ ర్యాంకు  సాధించగలిగా. కేవలం రెండు నెలలే ఈ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యాను. ఉద్యోగం చేసూ్తనే  ఎలాంటి కోచింగ్‌ లేకుండా పరీక్షకు సన్నద్ధమయ్యాను. 

చాలా ఆనందంగా ఉంది 
యామిని చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్‌ ఉండేది. ఉన్నత స్థాయిలో పెద్ద అధికారి కావాలని నేను చెబుతుండేవాడిని. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నతాధికారిగా ఉద్యోగం సాధించగలిగింది. ఈ ఉద్యోగం రావడం పట్ల చాలా ఆనందంగా ఉంది. నా ఆశయాన్ని నెరవేర్చింది. 
–చల్లా యాదగిరి, యామిని తండ్రి

కష్టపడితేనే ఫలితం 
జీవితంలో ఫెయిల్యూర్‌ వస్తేనే.. సక్సెస్‌కు దారిపడుతుంది. కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది. ప్రస్తుత యువత కూడా ఒక్కసారి ఫెయిల్‌ అయితే జీవితం అయిపోయిందనే అపోహతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రయత్నిస్తే కచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement