మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగిక దాడి | Woman Constable Files Case On Kukapally SI Suresh Kumar | Sakshi
Sakshi News home page

Hyderabad: మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగిక దాడి

May 14 2026 8:19 AM | Updated on May 14 2026 11:55 AM

Woman Constable Files Case On Kukapally SI Suresh Kumar

హైదరాబాద్: మహిళా కానిస్టేబుల్‌పై కన్నేసిన ఓ ఎస్సై ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాట­లు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని ఆ లేడీ కానిస్టేబుల్‌ బలవంతం చేసేసరికి ఎస్సై ఎదురుతిరిగాడు. దీంతో బాధితురాలు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

నెలన్నర కిందట నమోదైన ఈ కేసులో కొల్లూరు ఎస్సైను కూకట్‌పల్లి పోలీసులు బుధ­వారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సురేశ్‌కుమార్‌ 2020లో కూకట్‌పల్లి ఠాణాలో ఎస్సైగా పనిచేశారు. అదే సమయంలో ఎస్సైకు రైటర్‌గా ఓ మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అప్పటికే తనకు పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టిన ఎస్సై.. కానిస్టేబుల్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 

2022 సంవత్సరంలో బోనాల పండుగ సందర్భంగా కూకట్‌పల్లి చిత్తారమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న క్రమంలో.. ఎస్సై సురేశ్‌ మహిళా కానిస్టేబుల్‌ని గుడిలోకి తీసుకెళ్లి ఆమె నుదుటిన బొట్టు పెట్టి మనిద్దరికి పెళ్లి అయిందని నమ్మించాడు. ఆ తర్వాత ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. 2023లో ఎస్సై సురేశ్‌కు కొల్లూరు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయింది. కొంతకాలానికి ఎస్సై సురేశ్‌కు అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారని మహిళా కానిస్టేబుల్‌కు తెలిసింది. ఈ విషయమై ఎస్సైని ఆమె నిలదీసింది. దీంతో తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని రెండేళ్ల పాటు కాలాయాపన చేశాడు. ఈ సమయంలో లేడీ కానిస్టేబుల్‌ గర్భవతి అయింది. 

దీంతో కంగారు పడిపోయిన ఎస్సై.. ఆమెకు మాయమాటలు చెప్పి అబార్షన్‌ చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలని కానిస్టేబుల్‌ బలవంతం చేసేసరికి.. తాను ఎస్సై అని, కానిస్టేబుల్‌ను ఎలా పెళ్లి చేసుకుంటానని ఎదురు తిరిగాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్‌ 1న కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేసుకొని, భార్యాపిల్లలతో సహా పరారయ్యాడు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నెలన్నర తర్వాత పోలీసులు ఎస్సై సురేశ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఎస్సై సురేశ్‌పై లైంగిక దాడి కేసు నమోదైందని తెలియగానే అతడిని సస్పెండ్‌ చేసినట్టు శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement